ఏపీ భవన్‌కు ఎంపీ సబ్బం రూ. 3.43 లక్షలు బకాయి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏపీభవన్‌లో తమ పేరిట ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు చివరి నిమిషంలో పోటీపడ్డారు. ఏపీభవన్‌లో చాలామంది ఎంపీ, ఎమ్మెల్యేలు ఇంకా బకాయిలు చెల్లించలేదంటూ పత్రికల్లో వార్తలు రావడంతో వారంతా నానా హైరానా పడ్డారు. వందల్లోనే బకాయి ఉన్నా, వాటిని చెల్లించి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) సర్టిఫికేట్ తీసుకునేందుకు వారు హైరానా పడ్డారు.
కేంద్ర మంత్రి బలరాం నాయక్ రూ. 26,250, ఎంపీ సురేశ్ షెట్కార్ రూ. 20వేలు చెల్లించగా మంత్రులు శైలజానాథ్ రూ. 100, బాలరాజు రూ. 200, బస్వరాజు సారయ్య రూ. 900, ప్రసాద్‌కుమార్ రూ. 400 డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క రూ. 500, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, పి.కిష్టారెడ్డి, సుమన్ రాథోడ్, దేవినేని ఉమ, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు వందల్లో ఉన్న తమ బకాయిలను చెల్లించి ఎన్‌ఓసీ తీసుకున్నారు. సీమాంధ్ర నుంచి ఇంకా 25 మంది వరకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అత్యధికంగా ఎంపీ సబ్బం హరి రూ. 3.43లక్షల బకాయిలు ఉండగా, నిమ్మల కిష్టప్ప రూ. 22,500, కె.నారాయణ రూ.28,500, హర్షకుమార్ రూ.45,000, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి రూ.52,500, ఎన్.శివప్రసాద్ రూ. 6,750, కనుమూరి బాపిరాజు రూ. 3,750లతో పాటు మరి కొందరి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.