భద్రత డొల్ల..!
Published Sun, Apr 6 2014 10:47 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
న్యూఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ పోలీసుల్లో ఆందోళన తీవ్రతరమవుతోంది. ఎన్నికల భద్రత కోసం ఇంకా 10 వేల మంది అవసరం కాగా, వీరందరిని ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత డిసెంబర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగరవ్యాప్తంగా 50 వేల మంది మోహరించారు. అయితే ఈ నెల 10న నిర్వహించే పోలింగ్ భద్రత విధులకు తమ వద్ద 40 వేల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని పోలీసుశాఖ వర్గాలు తెలిపాయి. వీరిలో 700 మంది కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది. ఇతర పారామిలిటరీ బలగాలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడంతో ఢిల్లీకి కొరత తప్పడం లేదు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలు పోలింగ్ రోజు దాడులకు పాల్పడే అవకాశం ఉందని గూఢచార వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
అదనపు బలగాల మోహరింపు తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. ఐఎం అగ్రనాయకులు తెహసీన్ అఖ్తర్, వకాస్‌తోపాటు మరో ఇద్దరిని గత నెల అరెస్టు చేశారు. మరో ఆరుగురు ఐఎం కార్యకర్తలను వివిధ రాష్ట్రాల్లో నిర్బంధించారు. సార్వత్రిక ఎన్నికలను భగ్నం చేయడానికి కుట్రలు పన్నినట్టు వీళ్లంతా విచారణలో వెల్లడించారు. ఢిల్లీలోనూ దాడులు చేయడానికి ఐఎం వ్యూహరచన చేసినట్టు కూడా నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. ‘ఉగ్రవాదుల ప్రధానలక్ష్యం ఢిల్లీ. ఇది వరకే కొందరు ఉగ్రవాదులు ఎర్రకోట, అక్షర్‌ధామ్ ఆలయం వద్ద రెక్కీ నిర్వహించారు. అందుకే రద్దీగా ఉండే మార్కెట్లు, పర్యాటక ప్రదేశాల వద్ద అదనంగా బలగాలను మోహరించడం అనివార్యం’ అని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. దీనికితోడు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం, నగదు రవాణాను అడ్డుకోవడానికి బలగాలు అవసరం.
మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్, మహారాష్ట్రకు భారీగా పారామిలిటరీ బలగాలను తరలించారు. ఢిల్లీకి మరిన్ని బలగాలను కేటాయించాల్సిందిగా నగర పోలీసుశాఖ కేంద్ర హోంశాఖను కోరింది. కొరతను నివారించడానికి హిమాచల్‌ప్రదేశ్, హర్యానా నుంచి అదనపు బలగాలను తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మరో సీనియర్ అధికారి తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని బలగాలను ఢిల్లీలో మోహరించి ఉంచింది. రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోని 11,700పైగా పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలను మోహరించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు బూత్‌ల లోపలికి వెళ్లడాన్ని నిరోధించడానికి భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో అవసరం. ఢిల్లీ పోలీసుశాఖలో 76 వేల మంది ఉన్నప్పటికీ ఎన్నికలకు 40 వేల మందిని కేటాయించడం అసాధ్యమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. సిబ్బంది అత్యధికులు వీఐపీల, ట్రాఫిక్, పోలీసు కంట్రోల్, స్టేషన్ల సేవల్లో ఉండడమే ఈ పరిస్థితికి కారణం. సగం మంది పోలీసులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్నారని మరో అధికారి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు 65 పారామిలిటరీ బలగాల సిబ్బందికి ఢిల్లీ పోలీసులు సహకరించారు. వీరిని కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్), కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్), ఇండో-టిబెటన్ పోలీస్‌ఫోర్స్ నుంచి తీసుకొచ్చారు. ‘తొమ్మిది వేల మంది సిబ్బంది కొరతతో ఎన్నికలకు భద్రత కల్పించడం సాధ్యం కాదు. అయినా ఈ సవాల్‌ను ఎదర్కోవడానికి సిద్ధంగా ఉన్నామ’ అని అధికారి ఒకరు అన్నారు.
Advertisement
Advertisement