3 కోట్ల వివాహేతర సంబంధాలు రట్టయ్యాయి!
'లైఫ్ ఈజ్ షార్ట్. హ్యావ్ ఆన్ అఫైర్' నినాదంతో వివాహేతర బంధాలకు వేదికగా నిలిచిన ప్రముఖ ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ 'యాష్లే మాడిసన్' యూజర్లు ఒకొక్కరిగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ సంక్షోభం ఇలానే కొనసాగితే మరింతమంది ప్రాణాలుపోయే అవకాశాం ఉండటంతో పలు దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 46 దేశాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్న ఈ సైట్‌కు మూడు కోట్ల మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. ఆయా వ్యక్తులు తమ టేస్ట్‌కు తగ్గ పార్ట్నర్తో వివాహేతర బంధాన్ని కొనసాగించేందుకు ఈ సైట్ ఉపకరిస్తుంది. అయితే గత నెలలో యాష్లే సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారు. కస్టమర్ల వివరాలన్నింటినీ దొంగిలించి, యాష్లే యాజమాన్యంతో బేరసారాలకు దిగారు. భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. డీల్ కుదరకపోవడంతో విడతలవారీగా తమ దగ్గరున్న డేటాను లీక్ చేస్తున్నారు..
దీంతో కస్టమర్లలో తీవ్ర కలకలం చెలరేగింది. తమ ప్రైవేటు వ్యవహారం ఇలా నలుగురికీ తెలిసిపోవడాన్ని అవమానంగా భావించిన ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కేసులో సీరియస్‌నెస్‌ను గుర్తించిన కెనడా పోలీసులు అమెరికా ఎఫ్‌బీఐ సహకారంతో హ్యాకర్లను కనిపెట్టే పనిలో ఉంది. మరోవైపు యాష్లే మాడిసన్ మాతృసంస్థ అవిద్ లైఫ్ మీడియా కూడా తన క్లయింట్ల పరువు కాపాడేందుకు ముందుకొచ్చింది. వెబ్‌సైట్‌పై దాడి చేసిన హ్యాకర్ల వివరాలు తెలిపినవారికి రెండున్నర కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఈ వివాహేతర బంధాల లీకేజీ వ్యవహారం ముందుముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిమరి.