టీఎస్ ఆర్టీసీలో స్లీపర్ బస్సులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. అశోక్‌లేలాండ్ కంపెనీకి చెందిన ఈ బస్సులకు ఓ ప్రైవేటు సంస్థలో బాడీలు రూపొందిస్తున్నారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 బస్సులను కొనాలని నిర్ణయించి టెండర్లు పిలవగా, అశోక్‌లేలాండ్ కంపెనీ కాంట్రాక్టు పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ బస్సులకు సంబంధించి చాసిస్‌లను తయారు చేసిన ఆ కంపెనీ, మరో ప్రైవేటు కంపెనీతో కలసి వాటికి పూర్తి రూపాన్ని ఇస్తోంది. ఆ పని కూడా దాదాపు పూర్తయింది.
అన్ని బస్సులు ఆర్టీసీ చేతికి రావడానికి దాదాపు సిద్ధమయ్యాయి. కొత్త బస్సు సర్వీసులకు ఆర్టీసీ ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. పేరు ఖరారు కాగానే బస్సుపై రాసి లేలాండ్ కంపెనీ.. ఆర్టీసీకి అందించబోతోంది. ఆ వెంటనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు..: హైదరాబాద్ కేంద్రంగా పెద్ద సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలకు నడుస్తున్నాయి. అవన్నీ దాదాపు రాత్రివేళనే హైదరాబాద్‌నుంచి బయలుదేరుతున్నాయి.
ఈ ట్రావెల్స్ సంస్థలు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా 80 శాతం స్లీపర్ బస్సులనే తిప్పుతున్నాయి. రైళ్ల తరహాలో రాత్రి వేళ పడుకుని ప్రయాణించేందుకే ఇష్టపడుతున్న ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులవైపే మొగ్గుచూపుతున్నారు. ఆర్టీసీలో స్లీపర్ బస్సులు లేకపోవటంతో ప్రయాణికుల ఆదరణను చూరగొనలేకపోతోంది. దీనిని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు అశోక్‌లేలాండ్ బస్సుల సరఫరాకు కాంట్రాక్టు దక్కించుకుంది.
కాగా, మరో నెలరోజుల్లో స్లీపర్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. వాటిని ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ, ఏలూరు, ఒంగోలు లాంటి పట్టణాల మధ్య తిప్పనున్నారు. ఈ బస్సులకు ఆదరణ బాగుంటే వెంటనే మరికొన్ని బస్సులను సమకూర్చుకోవాలని ఎండీ భావిస్తున్నారు. వీటికి తోడు త్వరలో అద్దె ప్రాతిపదికన నాన్ ఏసీ స్లీపర్ బస్సులను కూడా సమకూర్చుకోనున్నారు.
టీఎస్ఆర్టీసీలో తొలిసారి..
రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా వెన్నెల పేరుతో కొన్ని స్లీపర్ బస్సులుండేవి. అవన్నీ ఏపీ పరిధిలోని డిపోల్లోనే ఉండేవి. దీంతో రాష్ట్రం విడిపోయాక అవి ఏపీఎస్ ఆర్టీసీకే దక్కాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సమకూర్చుకుంటున్న కొత్త స్లీపర్ బస్సులే తెలంగాణకు తొలి స్లీపర్ సర్వీసులు కానున్నాయి. వీటìకి మంచి ఆదరణ లభిస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. బస్సు లోపల కిందరెండు, పైన రెండు చొప్పున రెండు వరసల్లో బెర్తులుంటాయని అధికార వర్గాలు చెపుతున్నాయి.