ఆ ఇద్దరికీ ముప్పు తప్పినట్టే(నా)!
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో చిక్కుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజెలపై బీజేపీ ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బీహార్ ఎన్నికల ముందు ఎలాంటి చర్య వద్దని, విపక్షాల ఒత్తిడికి తలొగ్గకూడదని ఆర్ఎస్ఎస్ ఉద్బోధించడంతో మహిళా నేతలకు ముప్పు తప్పినట్టే కనబడుతోంది.
మరోవైపు 'లలిత్ గేట్'పై బీజేపీ అగ్రనాయకులు శుక్రవారం మంతనాలు సాగించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ అయ్యారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఇరువురు నాయకులు మంతనాలు సాగించినట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి జైట్లీ వ్యూహం ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది.
కాగా వసుంధర రాజె ప్రభుత్వం శాసనసభలో బలం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్నామి స్పష్టం చేశారు. 'లలిత్ గేట్'లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ, రాజె తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.