కేంద్ర మాజీ మంత్రి నన్ను రేప్ చేశాడు
నోయిడా: కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అశోక్ ప్రధాన్‌పై లైంగికదాడి, హత్యాయత్నం కేసు నమోదైంది. నోయిడాకు చెందిన 24 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన్ నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన బీజేపీని వీడి ఎస్పీలో చేరారు.
ప్రధాన్‌తో పాటు మరో ఇద్దరిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిలో బాధితురాలి మామ, పంకజ్ జిందాల్ అనే మరో వ్యక్తి ఉన్నారు. మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి దారుణానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటిలోనూ, మరో చోట ప్రధాన్ తనపై లైంగికదాడి చేసినట్టు చెప్పింది. ఈ విషయం బయటకు చెబితే హతమారుస్తానని బెదిరించాడని ఆరోపించింది. 11 నెలల క్రితం నోయిడాలోని అత్తమామల ఇంటికి వెళ్లాక తనకు కష్టాలు మొదలయ్యాయని చెప్పింది. తన భర్త తాగుడుకు బానిసై వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. భర్తతో సహా కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని కేసు పెట్టింది. బాధితురాలికి ప్రధాన్ వివాహం జరిపించాడు. కాగా ఈ ఆరోపణలను ప్రధాన్ కొట్టిపారేశాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని, ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పాడు.