జాతీయ భాషకు ఆదరణేదీ?
నేడు హిందీ భాషాదినోత్సవం
జహీరాబాద్: దేశంలోని అన్ని ప్రాంతాలను ఏకం చేసి స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన హిందీ భాషకు నేడు సముచిత స్థానం లభంచడం లేదు. జాతీయ భాషగా, అధికార భాషగా కొనసాగుతున్నా నిరాదరణకు గురవుతోందని హిందీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లానికి పాఠశాలల్లో ఇస్తున్న ప్రాధాన్యతను హిందీ విషయంలో ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇంగ్లిషుకు ఇస్తున్న ప్రాధాన్యతను జాతీయ భాషకు మాత్రం ఆ స్థాయిలో ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంటులో సైతం సభ్యులు అధికంగా ఆంగ్లంలోనే మాట్లాడడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని వ్యతిరేకిస్తూ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టడం పట్ల హిందీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీ భాష సూత్రం అమలులో భాగంగా హిందీ మాట్లాడని ప్రాంతాల్లో ద్వితీయ భాషగా అమలు చేస్తున్నా మిగతా సబ్జెక్టులకు ఉత్తీర్ణత శాతం ఒక విధంగా, హిందీకి ఒక విధంగా చూడడంతో విద్యార్థలు హిందీ పట్ల ఆసక్తి చూపడం లేదంటున్నారు. పోస్టుల భర్తీలో సైతం అసమానతలు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హిందీ భాషకు సముచిత స్థానం కల్పించాలని భాషాభిమానులు కోరుతున్నారు.
హిందీ భాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి
జాతీయ సమైక్యతకు దోహదపడుతున్న హిందీ భాషకు సముచిత స్థానం కల్పించాలి. ఇందుకు పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.స్వాతంత్ర్య ఉద్యమంలో హిందీ భాష ప్రజలను ఏకం చేసింది. నేడు హిందీకి సముచిత స్థానం కల్పించక పోవడం విచారకరం. సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవంగా ప్రకటించినా అందుకు అనుగుణంగా కార్యక్రమాలు జరగడం లేదు. హిందీ లావో దేశ్ బచావో నినాదంతో వారం రోజుల పాటు హిందీ వారోత్సవాలను నిర్వహిస్తాం. - అశోక్కుమార్శేరి, హిందీ ప్రచార సమితి కార్యదర్శి, జహీరాబాద్