Asia Cup Archery
-
ధీరజ్ ధమాకా
బాగ్ధాద్ (ఇరాక్): ఆసియా కప్ ఆర్చరీ తొలి అంచె టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన ధీరజ్ పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో, టీమ్ విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో విజేతగా నిలిచాడు. వ్యక్తిగత విభాగం ఫైనల్లో ధీరజ్ 7–3తో భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్‌ను ఓడించాడు. టీమ్ విభాగం ఫైనల్లో ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్‌లతో కూడిన భారత జట్టు 6–2తో ఇస్లామ్, రూబెల్, అలీఫ్లతో కూడిన బంగ్లాదేశ్ జట్టుపై గెలిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో ధీరజ్–సిమ్రన్జోడీ 6–0తో దియా–ఇస్లామ్ జంట (బంగ్లాదేశ్)పై నెగ్గింది. ఇండియన్ ఆర్మీలో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ధీరజ్ విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్నాడు. గత ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోరీ్నలో ధీరజ్ రజత పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. -
భారత ఆర్చర్ల పసిడి పంట
షార్జా: ఆసియా కప్ స్టేజ్–3 ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్లు అదరగొట్టే ప్రదర్శన చేశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఇందులో ఐదుస్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. కాంపౌండ్ విభాగంలో భారత్‌కు ఏకంగా ఏడు పతకాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత అమ్మాయిలు క్లీన్‌స్వీప్ చేశారు. ప్రగతి స్వర్ణం నెగ్గగా... అదితి స్వామి రజతం, పర్ణీత్ కౌర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రియాంశ్ స్వర్ణం, ఓజస్ రజతం నెగ్గారు. కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు పసిడి పతకాలు దక్కించుకున్నాయి. ఆకాశ్, మృణాల్ చౌహాన్, పార్థ్ సాలుంకేలతో కూడిన భారత రికర్వ్ పురుషుల జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో త్రిషా పూనియా, పార్థ్ సాలుంకేలతో కూడిన టీమిండియా రజతం నెగ్గింది. -
భారత ఆర్చర్లకు ఆరు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత ఆర్చర్లకు రెండు స్వర్ణ పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు ఖాయమయ్యాయి. ఇరాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే టీమ్ విభాగంలో భారత్‌కు ఆరు పతకాలు లభించాయి. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత్‌కు చెందిన ప్రథమేశ్, రిషభ్ యాదవ్ ఫైనల్ చేరగా... సమాధాన్ జావ్కర్ కాంస్యం కోసం పోటీపడనున్నాడు. సమాధాన్ గెలిస్తే భారత్ ఈ విభాగంలో క్లీన్‌స్వీప్ చేస్తుంది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు పర్ణీత్ కౌర్, సాక్షి చౌదరీ ఫైనల్లోకి ప్రవేశించారు. -
ఆసియా కప్ ఆర్చరీకి ధీరజ్
విజయవాడ స్పోర్ట్స్: వచ్చే నెలలో చైనీస్ తైపీలో జరిగే ఆసియా కప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల రికర్వ్ జట్టులో విజయవాడ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఎంపికయ్యాడు. చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ విద్యార్థి అయిన ధీరజ్ హరియాణాలో జరిగిన జాతీయ సెలక్షన్ ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచి భారత జట్టులో స్థానాన్ని సంపాదించాడు. దేశవ్యాప్తంగా 30 మంది ఆర్చర్లు ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. నాలుగున్నరేళ్ల వయస్సులో దివంగత కోచ్ చెరుకూరి లెనిన్ వద్ద శిక్షణ ప్రారంభించిన ధీరజ్ జాతీయ అండర్–19 స్కూల్ గేమ్స్‌లో విజేతగా కూడా నిలిచాడు. ఓల్గా అకాడమీకి చెందిన మరో ఆర్చర్ తేళ్ల రవిచంద్ర భారత జట్టులో స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. -
సురేఖకు కేఎల్‌యూ అభినందన
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్ ఆర్చరీ పోటీల్లో స్వర్ణం, రెండు రజతాలు సాధించిన తమ విద్యార్థి జ్యోతి సురేఖను కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (కేఎల్‌యూ) అభినందించింది. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో సీఎస్ఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థిగా ఉన్న జ్యోతి సురేఖ గత రెం డేళ్ల కాలంలో అంతర్జాతీయస్థాయిలో 9 పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందని కేఎల్‌యూ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తెలిపారు. తమ యూనివర్సిటీలో విద్య అభ్యసించేందుకు జ్యోతి సురేఖకు పూర్తి ఫీజును మినహాయించామని ఈ సందర్భంగా సత్యనారాయణ వివరించారు.