Asian cup hockey
-
ఇకనైనా ఉద్యోగం ఇస్తారేమో...
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్‌కు 13 ఏళ్ల తర్వాత టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన గోల్‌కీపర్ సవితా పునియా ఈ విజయం తన జీవితంలోనూ మార్పు తెస్తుందని ఆశాభావంతో ఉంది. తొమ్మిదేళ్లుగా ఆమె భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్నా ఇంకా నిరుద్యోగిగానే ఉంది. ‘మెడల్ లావో... నౌక్రీ పావో’ (పతకం గెలవండి, ఉద్యోగం పొందడి) పథకం కింద ఉద్యోగం ఇస్తామని హరియాణా ప్రభుత్వ క్రీడాధికారులు హామీలు ఇస్తున్నా... అదింకా కార్యరూపం దాల్చడం లేదు. ఆసియా కప్ విజయంతోనైనా వారి హామీ ఆచరణ సాధ్యం కావాలని 27 ఏళ్ల సవిత కోరుకుంటోంది. -
జపాన్‌కు షాక్ ఇచ్చి...
కకమిగహర (జపాన్): ప్రత్యర్థి ఎవరైనా ఏమాత్రం బెదరకుండా ఆడుతోన్న భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్‌లో తమ విజయపరంపరను కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టు 4–2 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ను బోల్తా కొట్టించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (7వ, 9వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... నవ్‌జ్యోత్ కౌర్ (9వ నిమిషంలో), లాల్రెమ్సియామి (38వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు సుజీ (17వ నిమిషంలో), ఇషిబాషి (28వ నిమిషంలో) చెరో గోల్ అందించారు. మరో సెమీఫైనల్లో చైనా 3–2తో కొరియాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ తలపడుతుంది. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 1999, 2004, 2009లలో ఫైనల్‌కు చేరిన టీమిండియా 2004లో టైటిల్ నెగ్గి, మిగతా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. -
చైనాపై తొలిసారి జయభేరి
కకమిగహర (జపాన్): మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4–1 గోల్స్‌తో చైనాపై జయభేరి మోగించింది. 1985లో మొదలైన ఆసియా కప్‌లో ఇప్పటివరకు చైనాతో 11 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఆ జట్టును ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (19వ ని.), నవజ్యోత్ కౌర్ (32వ ని.), నేహా గోయల్ (49వ ని.), కెప్టెన్ రాణి రాంపాల్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. నేడు (మంగళవారం) జరిగే చివరి పూల్ మ్యాచ్‌లో భారత్... మలేసియాతో తలపడుతుంది. ప్రపంచకప్‌కు భారత్ అర్హత హమ్మయ్య... ఆసియా కప్ నెగ్గితేనే ప్రపంచకప్‌కు అర్హతనే భారం తొలగింది. మహిళల జట్టు ప్రపంచకప్‌కు అర్హత సంపాదించింది. ఆఫ్రికా నేషన్స్ కప్‌ను దక్షిణాఫ్రికా గెలవడం ద్వారా భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది లండన్‌లో జరగనుంది. భారత్ చివరి సారిగా 2010లో ప్రపంచకప్ ఆడింది. -
పాక్ పనిపట్టి ఫైనల్లోకి...
ఢాకా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మరోసారి చావుదెబ్బ తీసింది. శనివారం జరిగిన తమ చివరి సూపర్–4 మ్యాచ్‌లో పాక్‌ను 4–0తో చిత్తుగా ఓడించింది. దీంతో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ ఆసియా కప్ ఫైనల్లోనూ ప్రవేశించింది. ఈ టోర్నీలో పాక్‌పై గెలవడం భారత్‌కు ఇది రెండోసారి కాగా ఈ ఏడాది నాలుగోసారి కావడం విశేషం. ఈ పరాజయంతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. సత్బీర్ సింగ్ (39వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (51వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (52వ ని.లో), గుర్జంత్ సింగ్ (57వ ని.లో) భారత్ తరఫున గోల్స్ సాధించారు. అంతకుముందు తొలి రెండు క్వార్టర్స్‌లో భారత జట్టు కాస్త నెమ్మదిగానే ఆడింది. తమకు లభించిన పీసీని సొమ్ము చేసుకోలేకపోయింది. ఇక చివరి రెండు క్వార్టర్లలో భారత్ విజృంభించింది. 39వ నిమిషంలో లలిత్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న సత్బీర్ జట్టుకు తొలి గోల్ అందించాడు. మ్యాచ్ చివరి పది నిమిషాల్లో భారత్ ఒక్కసారిగా విరుచుకుపడి ఆరు నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో పాక్‌కు భారీ ఓటమి ఖాయమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు మలేసియాతో తలపడనుంది. కొరియాతో జరిగిన సూపర్–4 చివరి మ్యాచ్‌ను మలేసియా 1–1తో ‘డ్రా’ చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. 1982లో మొదలైన ఆసియా కప్‌లో భారత్ ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. 1982, 1985, 1989, 1994, 2013లలో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా 2003, 2007లలో చాంపియన్‌గా నిలిచింది. 1999లో మూడో స్థానాన్ని సంపాదించింది. ఆసియా కప్ ఫైనల్లో భారత్, మలేసియా తలపడనుండటం ఇదే తొలిసారి. -
భారత్ జైత్రయాత్ర
ఢాకా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఎదురులేకుండా దూసుకెళుతోంది. సూపర్–4 మ్యాచ్‌లో భాగంగా మలేసియా జట్టుతో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 6–2 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో మలేసియాకిదే తొలి ఓటమి కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ విజయంతో అజ్లాన్ షా కప్, హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో మలేసియా చేతిలో ఎదురైన పరాజయాలకు భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. అటు కొరియా, పాక్‌ల మ్యాచ్ 1–1తో డ్రా కావడంతో సూపర్–4 దశలో భారత్ టాప్‌లో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కచ్చితమైన అటాకింగ్‌తో విరుచుకుపడి ఏకంగా ఐదు ఫీల్డ్ గోల్స్ చేయడం విశేషం. ఆకాశ్‌దీప్ (15వ నిమిషంలో), ఉతప్ప (24వ ని.లో), గుర్జంత్ సింగ్ (33వ ని.లో), సునీల్ (40వ ని.లో), సర్దార్ సింగ్ (60వ ని.లో)ల నుంచి ఫీల్డ్ గోల్స్ రాగా 19వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. మలేసియా నుంచి రహీమ్ (50వ ని.లో), రోసిల్ (59వ ని.లో) గోల్స్ చేశారు. చివరి మ్యాచ్ పాక్‌తో... అజేయంగా దూసుకెళుతున్న భారత జట్టు సూపర్–4లో తమ చివరి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్‌తో ఆడనుంది. ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పాక్‌ను చిత్తు చేసి జోరులో ఉన్న భారత్ మరోసారి వారికి చేదు ఫలితాన్ని ఇవ్వాలని భావిస్తోంది. కొరియాపై 1–1తో డ్రా చేసుకున్న భారత్‌కు ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఓటమి లేదు. ఆ మ్యాచ్‌లో లోపాలను సరిచేసుకున్న అనంతరం భారత జట్టు మలేసియాను దారుణంగా ఓడించింది. ఇప్పటికే సూపర్–4లో నాలుగు పాయింట్లతో ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్‌లో మరో ‘డ్రా’ ఎదురైనా ఆదివారం జరిగే ఫైనల్ బరిలో నిలుస్తుంది. మొత్తం గోల్స్ విషయంలో మన్‌ప్రీత్ సింగ్ సేన మిగిలిన జట్లకన్నా ముందుంది. అటు పాక్ జట్టు ఫైనల్‌పై ఆశలు పెట్టుకోవాలంటే భారత్‌పై భారీ తేడాతో నెగ్గి ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సాయంత్రం గం. 5.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం. -
పాక్‌ను చిత్తుచేసిన టీమిండియా..
-
పాక్‌ను చిత్తుచేసిన టీమిండియా..
ఢాకా: ఆసియాకప్ హాకీ టోర్నీలో నేడు(ఆదివారం) జరిగిన అసలు సిసలు పోరులో చిరకాల పత్యర్థి పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది. చివరిలీగ్ మ్యాచ్‌లో 3-1తో గెలిచి సగర్వంగా సూపర్-4 దశకు చేరింది. కొత్త కోచ్ జోయెర్డ్ మరీన్ సారథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు జపాన్, బంగ్లాదేశ్, పాక్‌లపై వరుసగా గెలుపొంది టోర్నిలో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ తాజా విజయంతో ఇంగ్లండ్‌లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్‌లో పాక్‌పై 6-1 ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక యుద్దవాతావరణం తలపించిన ఈమ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తొలి అర్ధభాగం నుంచే ఆధిపత్యం కనబర్చారు. చింగేల్స్న్సన్ సింగ్ 17 వనిమిషంలో సాధించిన గోల్‌తో భారత్‌కు 1-0 ఆధిక్యం లభించింది. 44వ నిమిషంలో రమణ్ దీప్ సింగ్ రెండో గోల్ సాధించాడు. ఇక 45 నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ ప్రీత్‌సింగ్ గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 3-0 ఆధిక్యం సాధించింది. ఇక 49 నిమిషంలో పాక్ ఆటగాడు అలీషాన్ గోల్ చేసిన లాభం లేకపోయింది. 3-1తో భారత్ విజయం సులువైంది. పాక్ సీనియర్ ఆటగాళ్లైన రిజ్వాన్, మహమ్ముద్ క్రీడాస్పూర్తీ మరిచి ప్రవర్తించడంతో రిఫరీ ఎల్లో కార్డు చూపించడంతో పాక్ కొద్దీసేపు 9 మంది ప్లేయర్లతోనే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
దాయాదుల ధమాకా పోరు
ఢాకా: అద్భుత విజయాలతో దూసుకెళుతున్న భారత జట్టు నేడు అసలు సిసలు పోరుకు సిద్ధమవుతోంది. ఆసియా కప్ హాకీ టోర్నీలో భాగంగా తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా లీగ్ సమరానికి సై అంటోంది. ఆట ఏదైనా పాక్‌తో మ్యాచ్ అంటేనే అభిమానుల జోష్ వేరేలా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మన్‌ప్రీత్ సింగ్ బృందం పూల్ ‘ఎ’ ప్రారంభ మ్యాచ్‌లో జపాన్ను 5–1తో, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7–0తో ఘనవిజయాలను అందుకుంది. తద్వారా ఆరు పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఈ విజయాలతో భారత్ ఇప్పటికే సూపర్–4 దశకు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌నూ నెగ్గి లీగ్ దశను అజేయంగా ముగించాలని కోరుకుంటోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత జట్టుకు ఇప్పటిదాకా ఈ టోర్నీలో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకాలేదు. అన్ని విభాగాల్లో అత్యంత నైపుణ్యంతో దాడికి దిగి భారీ గోల్స్‌ను రాబట్టింది. కొన్ని అద్భుత ఫీల్డ్ గోల్స్తోనూ ఆకట్టుకోగలిగింది. అయితే పెనాల్టీ కార్నర్ (పీసీ) అవకాశాలను మాత్రం తగిన రీతిలో సొమ్ముచేసుకోలేకపోతోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అయితే ఏకంగా 13 పీసీలు వచ్చినా వాటిల్లో రెండింటిని మాత్రమే గోల్‌గా మలిచింది. అటు ఇటీవలే రోలంట్ ఓల్ట్‌మన్స్ స్థానంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కోచ్ జోయెర్డ్ మరీన్‌కు కూడా నేటి మ్యాచ్ కీలకంగానే మారింది. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత జట్టు అదే ఊపులో పాక్‌ను కూడా మట్టికరిపించాలనే కసితో ఉంది. అయితే మ్యాచ్‌లో ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు పాక్ జట్టుకు ఈ టోర్నీలో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7–0తో చిత్తు చేసినా.. జపాన్‌పై మాత్రం 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుత పాక్ జట్టు అంత ప్రమాదకరంగా లేకపోయినా తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించగల నైపుణ్యం ఉంది. 14వ ర్యాంకులో కొనసాగుతున్న పాక్ జట్టులో తాజాగా సీనియర్ ఆటగాళ్లను తిరిగి చేర్చుకుని అద్భుతాలను ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే వారికి సూపర్–4 అవకాశాలు సన్నగిల్లుతాయి. 169 ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య 169 మ్యాచ్‌లు జరి గాయి. భారత్ 57 మ్యాచ్‌లో గెలుపొందగా... పాకిస్తాన్ 82 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగతా 30 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
భారత్ 7 బంగ్లాదేశ్ 0
ఢాకా: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్లో మరో భారీ విజయం సాధించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 7–0తో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో భారత్ 5–1తో జపాన్ను ఓడించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్‌కు ఏ దశలోనూ బంగ్లాదేశ్ నుంచి పోటీ ఎదురుకాలేదు. అవకాశం దొరికినపుడల్లా బంగ్లాదేశ్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసిన భారత్ క్రమం తప్పకుండా గోల్స్ సాధించింది. భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (7వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (10వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (13వ ని.లో), అమిత్ రోహిదాస్ (20వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (46వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హర్మన్‌ప్రీత్ సింగ్ (28వ, 47వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 13 పెనాల్టీ కార్నర్లు రాగా... రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలిచారు. లేదంటే టీమిండియాకు మరింత భారీ విజయం దక్కేది. మరోవైపు పాకిస్తాన్, జపాన్ జట్ల మధ్య జరిగిన పూల్ ‘ఎ’ మరో లీగ్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. -
హాకీ ఆసియాకప్: బంగ్లాదేశ్‌పై భారత్ గెలుపు
ఢాకా: హకీ ఆసియాకప్ పూల్-ఏలో బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు రెండో విజయం సాధించింది. జపాన్‌పై గెలిచి శుభారంభాన్ని అందుకున్న భారత్ తన జైత్రయాత్రను కొనసాగించింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7-0తో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. మ్యాచ్ ఆధ్యంతం భారత ఆటగాళ్లు ఆధిపత్యం కనబర్చారు. మ్యాచ్ ఏడో నిమిషంలో గుర్జాంత్ సింగ్ తొలి గోల్ సాధించగా.. ఆకాశ్ దీప్ (11వ నిమిషం), లలీత్ ఉపాధ్యాయ(14వ), అమిత్ రోహిదాస్(21వ), రమణ్‌దీప్ సింగ్(46వ)లు గోల్స్ సాధించారు. ఇక మరోసారి పెనాల్టీ కార్నర్లు సద్వినియోగం చేసుకుంటూ హర్మన్ ప్రీత్ సింగ్ 27వ నిమిషం, 57 వనిమిషంలో రెండు గోల్స్ సాధించాడు. దీంతో భారత్ 7-0తో బంగ్లాదేశ్‌పై సునాయసంగా విజయం సాధించింది. పూల్-ఏలో భారత్ మూడో లీగ్ మ్యాచ్‌ను ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనుంది. -
భారత్ శుభారంభం
ఢాకా: కొత్త కోచ్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఆసియా కప్ టోర్నమెంట్లో టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఆడుతూ భారత్ శుభారంభం చేసింది. జపాన్‌తో బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన భారత్ నాలుగు క్వార్టర్స్‌లోనూ గోల్స్ చేయడం విశేషం. ఆట మూడో నిమిషంలో ఎస్వీ సునీల్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్‌కు 22వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ రెండో గోల్‌ను అందించాడు. 33వ నిమిషంలో రమణ్‌దీప్ సింగ్ ఒక గోల్ చేయగా... 35వ, 48వ నిమిషాల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించాడు. జపాన్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను నాలుగో నిమిషంలో కెంజీ కిటజాటో చేశాడు. చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్‌పై అనూహ్యంగా వేటు వేయడంతో గత నెలలో మారిన్ జోయెర్డ్ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలో ఆకాశ్‌దీప్ అందించిన పాస్‌ను సునీల్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ బోణీ చేసింది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్లు రాగా రెండింటిని హర్మన్‌ప్రీత్ సద్వినియోగం చేసుకున్నాడు. శుక్రవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. తొలి రోజు జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 7–0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. -
ఇక చావోరేవో
ఇపో (మలేసియా): వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో బెర్త్ దక్కించుకోవాలంటే భారత్ మరో రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఆసియాకప్ హాకీలో విజేతగా నిలిస్తేనే భారత్‌కు ఈ అవకాశం ఉంటుంది. లీగ్ దశలో తిరుగులేని ఆటతీరుతో అదరగొట్టిన భారత్... ఇక సెమీస్, ఫైనల్స్‌లోనూ అదే తరహాలో ఆడితేనే ప్రపంచకప్ అవకాశం దక్కుతుంది. ఇందులో భాగంగా తొలి పరీక్ష నేడు ఎదురవుతుంది. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆతిథ్య మలేసియాతో భారత్ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్, కొరియాల మధ్య జరుగుతుంది. లీగ్ దశలో భారత్ తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను 8-0తో, దక్షిణ కొరియాను 2-0తో బంగ్లాదేశ్‌పై 9-1తో నెగ్గి పూల్ బిలో టాప్‌గా నిలిచింది. ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. మిడ్ ఫీల్డ్‌లో కెప్టెన్ సర్దారా అండగా ఉండడంతో మన్‌ప్రీత్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, ఉతప్ప రాణిస్తున్నారు. అలాగే అంతగా అనుభవం లేని యువ ఫార్వర్డ్‌లైన్ మన్దీప్ సింగ్, నితిన్ తిమ్మయ్య, మలక్ సింగ్ కూడా విశేషంగా రాణించడంతో భారత్ విజయాలను సాధించింది. డ్రాగ్ ఫ్లికర్స్ రూపిందర్, రఘునాథ్ బంగ్లా మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో రెచ్చిపోయారు. వీరి జోరుతో నేటి మ్యాచ్‌లోనూ నెగ్గి తుది పోరుకు అర్హత సాధించాలనే ఆరాటంలో భారత్ ఉంది. మరోవైపు పూల్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన మలేసియా స్థానిక మద్దతే బలంగా బరిలోకి దిగనుంది. ఊహించని రీతిలో ఆడడం ఈ జట్టు ఆటగాళ్ల లక్షణం. తనదైన రోజున ఎలాంటి జట్టునైనా మట్టికరిపించగలరు. పలు సందర్భాల్లో ఈ జట్టును ఎదుర్కొన్న భారత్‌కు కూడా ఈ విషయం తెలుసు. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చెలరేగాలని కెప్టెన్ సర్దారా భావిస్తున్నాడు.