ఢాకా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఎదురులేకుండా దూసుకెళుతోంది. సూపర్–4 మ్యాచ్‌లో భాగంగా మలేసియా జట్టుతో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 6–2 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో మలేసియాకిదే తొలి ఓటమి కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ విజయంతో అజ్లాన్ షా కప్, హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో మలేసియా చేతిలో ఎదురైన పరాజయాలకు భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.
అటు కొరియా, పాక్‌ల మ్యాచ్ 1–1తో డ్రా కావడంతో సూపర్–4 దశలో భారత్ టాప్‌లో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కచ్చితమైన అటాకింగ్‌తో విరుచుకుపడి ఏకంగా ఐదు ఫీల్డ్ గోల్స్ చేయడం విశేషం. ఆకాశ్‌దీప్ (15వ నిమిషంలో), ఉతప్ప (24వ ని.లో), గుర్జంత్ సింగ్ (33వ ని.లో), సునీల్ (40వ ని.లో), సర్దార్ సింగ్ (60వ ని.లో)ల నుంచి ఫీల్డ్ గోల్స్ రాగా 19వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. మలేసియా నుంచి రహీమ్ (50వ ని.లో), రోసిల్ (59వ ని.లో) గోల్స్ చేశారు.
చివరి మ్యాచ్ పాక్‌తో...
అజేయంగా దూసుకెళుతున్న భారత జట్టు సూపర్–4లో తమ చివరి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్‌తో ఆడనుంది. ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పాక్‌ను చిత్తు చేసి జోరులో ఉన్న భారత్ మరోసారి వారికి చేదు ఫలితాన్ని ఇవ్వాలని భావిస్తోంది. కొరియాపై 1–1తో డ్రా చేసుకున్న భారత్‌కు ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఓటమి లేదు. ఆ మ్యాచ్‌లో లోపాలను సరిచేసుకున్న అనంతరం భారత జట్టు మలేసియాను దారుణంగా ఓడించింది.
ఇప్పటికే సూపర్–4లో నాలుగు పాయింట్లతో ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్‌లో మరో ‘డ్రా’ ఎదురైనా ఆదివారం జరిగే ఫైనల్ బరిలో నిలుస్తుంది. మొత్తం గోల్స్ విషయంలో మన్‌ప్రీత్ సింగ్ సేన మిగిలిన జట్లకన్నా ముందుంది. అటు పాక్ జట్టు ఫైనల్‌పై ఆశలు పెట్టుకోవాలంటే భారత్‌పై భారీ తేడాతో నెగ్గి ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సాయంత్రం గం. 5.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment