ఢాకా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మరోసారి చావుదెబ్బ తీసింది. శనివారం జరిగిన తమ చివరి సూపర్–4 మ్యాచ్‌లో పాక్‌ను 4–0తో చిత్తుగా ఓడించింది. దీంతో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ ఆసియా కప్ ఫైనల్లోనూ ప్రవేశించింది. ఈ టోర్నీలో పాక్‌పై గెలవడం భారత్‌కు ఇది రెండోసారి కాగా ఈ ఏడాది నాలుగోసారి కావడం విశేషం.
ఈ పరాజయంతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. సత్‌బీర్ సింగ్ (39వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (51వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (52వ ని.లో), గుర్జంత్ సింగ్ (57వ ని.లో) భారత్ తరఫున గోల్స్ సాధించారు. అంతకుముందు తొలి రెండు క్వార్టర్స్‌లో భారత జట్టు కాస్త నెమ్మదిగానే ఆడింది. తమకు లభించిన పీసీని సొమ్ము చేసుకోలేకపోయింది.
ఇక చివరి రెండు క్వార్టర్లలో భారత్ విజృంభించింది. 39వ నిమిషంలో లలిత్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న సత్‌బీర్ జట్టుకు తొలి గోల్ అందించాడు. మ్యాచ్ చివరి పది నిమిషాల్లో భారత్ ఒక్కసారిగా విరుచుకుపడి ఆరు నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో పాక్‌కు భారీ ఓటమి ఖాయమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు మలేసియాతో తలపడనుంది. కొరియాతో జరిగిన సూపర్–4 చివరి మ్యాచ్‌ను మలేసియా 1–1తో ‘డ్రా’ చేసుకొని రెండో స్థానంలో నిలిచింది.
1982లో మొదలైన ఆసియా కప్‌లో భారత్ ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. 1982, 1985, 1989, 1994, 2013లలో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా 2003, 2007లలో చాంపియన్‌గా నిలిచింది. 1999లో మూడో స్థానాన్ని సంపాదించింది. ఆసియా కప్ ఫైనల్లో భారత్, మలేసియా తలపడనుండటం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment