Asian Games 2026
-
మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడు: అగార్కర్
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో పర్యటించే భారత టీ20 జట్టుకు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు-2026 జట్టులోనూ అతడికి చోటు ఇచ్చారు.తండ్రిగా నేను సాధించే గొప్ప రికార్డు అదేఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆజ్‌తక్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘రికార్డుల గురించి వైభవ్ అస్సలు పట్టించుకోడు. ఇప్పుడిక టీమిండియా తరఫున మ్యాచ్‌లు గెలవడంపైనే అతడి దృష్టి ఉంటుంది.వైభవ్ టీమిండియా గెలుపులో భాగమైతే తండ్రిగా నేను సాధించే అత్యంత గొప్ప రికార్డు అదే అవుతుంది’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు. కాగా గతేడాది నుంచి ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పరుగుల వరదరాజస్తాన్ రాయల్స్ తరఫున 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లోనూ 36 బంతుల్లో సెంచరీతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించి.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతకు ముందు భారత్ అండర్-19 వరల్డ్‌కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ‘‘తనను కచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అనేలా వైభవ్ తన ఆటతో ఒక రకంగా మమ్మల్ని బలవంతపెట్టాడు. పదిహేనేళ్ల పిల్లాడని మాకూ తెలుసు.మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడుఅయితే, చిన్న వయసులోనే రెండు ఐపీఎల్ సీజన్లలో వరుసగా సత్తా చాటడం మామూలు విషయం కాదు. కేవలం ఐపీఎల్ ఒక్కటనే కాదు.. భారత్ అండర్-19 జట్టు తరఫునా అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడి ప్రతిభను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకున్నాము.టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తే అతడు తప్పక తన ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. మున్ముందు కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, వాటిని ఎదుర్కోగల సత్తా, టెంపర్మెంట్ వైభవ్‌కు ఉన్నాయి. ఒకరకంగా వైభవ్ తన ప్రదర్శనలతో తనకు తానే టీమిండియాకు ఎంపిక చేసుకున్నాడు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు. సూపర్ ఫామ్ కొనసాగిస్తూ పదిహేనేళ్ల వయసుకే ఇప్పుడిలా టీమిండియాకు ఎంపికయ్యాడు.చదవండి: అందుకే సూర్యను తప్పించాము: అగార్కర్ -
BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే!
ఊహించిందే జరిగింది.. రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సువర్ణావకాశం వచ్చింది. ఐపీఎల్-2026లో సత్తా చాటిన ఈ చిచ్చరపిడుగుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతడిని ఏకంగా టీమిండియాకు ఎంపిక చేసింది.సచిన్ రికార్డు బద్దలుజూన్లో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో పర్యటించే భారత టీ20 జట్టుకు వైభవ్‌కు ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులోనూ అతడికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు.అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేశాడు. ఇక వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌పై అతడు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది.నిలకడైన ఆట.. విధ్వంసకర బ్యాటింగ్గతేడాది రాజస్తాన్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో శతకాల మోత మోగించాడు.అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులతో రాణించి.. భారత్ విజేతగా నిలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.అత్యధిక పరుగుల వీరుడిగా ఘనతఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 36 బంతుల్లో శతక్కొట్టాడు. ఓవరాల్‌గా పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు.తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు వైభవ్. ఇప్పటికే అత్యంత పిన్న వయస్సులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పైసా వసూల్ ప్రదర్శన.. టీమిండియాకు ఎంపికఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన బీసీసీఐ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదిహేనేళ్ల వయస్సులోనే అతడిని ఎంపిక చేయడం విశేషం. ఓవరాల్‌గా రాజస్తాన్ ప్లే ఆఫ్స్‌ను చేర్చి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చిన వైభవ్.. ఇప్పుడు టీమిండియా తరఫున దుమ్ములేపేందుకు సిద్ధమయ్యాడు. చిన్న వయస్సులోనే భారత జట్టుకు ఎంపికైన వైభశ్ సూర్యవంశీకి శుభాభినందనలు.. అతడి బంగారు భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్!! చదవండి: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు జట్లు ఇవే -
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు
సింగపూర్: అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ‘ఓవర్లో 6 సిక్సర్ల’ ఫీట్ మరోసారి నమోదైంది. నేపాల్ బ్యాటర్ కుశాల్ భుర్తేల్ ఈ అరుదైన జాబితాలో చేరాడు. ఆసియా క్రీడల అర్హత టోర్నీలో భాగంగా ఆదివారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో కుశాల్ ఈ ఘనతను సాధించాడు. చైనా లెఫ్టార్మ్ స్పిన్నర్ చెన్ జూ యూ ఓవర్లో అతను ఆరు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో తొలి ఐదు బంతులను కుశాల్ వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టాడు. తర్వాతి బంతిని చెన్ ‘వైడ్’గా వేశాడు. అయితే ఈ అదనపు బంతిని కూడా కుశాల్ సిక్స్‌గా మలచడంతో ఓవర్లో 6 గీ6 పూర్తయింది. మ్యాచ్‌లో కుశాల్ 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 16 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు. అతని జోరుకు తోడు కుశాల్ మల్లా (47 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్ పౌడేల్ (21 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో నేపాల్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 313 పరుగులు చేసింది. అనంతరం 19.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలిన చైనా 221 పరుగుల తేడాతో ఓడింది. -
Asian Games: వైభవ్‌కు చోటు.. భారత జట్టు ఇదే!
ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.ఓపెనర్ల విభాగంలో పోటీఓపెనర్ల విభాగంలో సీనియర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ల నుంచి వైభవ్ సూర్యవంశీకి గట్టి పోటీ ఉంది. అయితే, రాయల్స్‌లో తన సహచర ఆటగాడు జైసూ కంటే వైభవ్ ఈసారి గొప్పగా ఆడిన సంగతి తెలిసిందే.ఐపీఎల్-2026లో వైభవ్ 776 పరుగులతో సత్తా చాటగా.. జైస్వాల్ 427 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్ విజేత అభిషేక్ శర్మ 563 పరుగులతో రాణించగా.. భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 477 పరుగులు సాధించాడు.ఇషాన్‌కు చోటు లేదు!ఇక ఇషాన్ కూడా సన్‌రైజర్స్ తరఫున 602 పరుగులతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఓపెనర్ల విభాగంలో అభిషేక్, ఇషాన్ సత్తా చాటగా.. అందరికంటే వైభవ్ అత్యధిక పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆల్‌రౌండర్లు, బౌలర్లు వీరేఇక సంజూను వన్‌డౌన్‌లో పంపినా.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ బ్యాటర్ల విభాగంలో సెట్ అయిపోతారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, హర్ష్ దూబేలను ఎంపిక చేసే అవకాశం ఉంది.బౌలర్ల విషయానికొస్తే.. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయిలకు అవకాశం ఉండొచ్చు. కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈసారి కూడా విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.పసిడి పతకాలతో సత్తా చాటిన భారత జట్లుకాగా 2022లో తొలిసారిగా బీసీసీఐ సీనియర్ పురుషుల, మహిళల క్రికెట్ జట్టును ఆసియా క్రీడలకు పంపింది. టీ20 ఫార్మాట్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పసిడి పతకం సాధించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది.అయితే, ఈసారి ప్రధాన టీ20 జట్టులోని సభ్యులను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా జపాన్‌లోని ఐచీ- నగోయాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు-2026 ఎడిషన్ నిర్వహించనున్నారు. ఇక గత పర్యాయం చైనా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆసియా క్రీడలు-2026: భారత అత్యుత్తమ టీ20 జట్టు ఇదేఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయి, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి.ప్రాబబుల్స్ జాబితాయశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: ‘అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ ఖేల్ ఖతం’ -
‘నా చావు కోరుకుంటున్నారు.. నేను మొండిదాన్ని’
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తన చావును కోరుకుంటోందని ఆరోపించింది. కాగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన అనంతరం వినేశ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా విజయంకేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో ఆమె పతకానికి దూరమైంది. ఆ తర్వాత రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్... రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. తల్లిగా మారిన అనంతరంఇటీవల తల్లిగా మారిన అనంతరం తిరిగి మ్యాట్‌పై అడుగు పెట్టాలనుకున్న ఈ హర్యానా అథ్లెట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో న్యాయపోరాటం చేసిన వినేశ్ ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొంది. అయితే, ఇక్కడా ఆమెకు చుక్కెదురైంది.మీనాక్షి గోయత్ చేతిలో ఓటమిఎన్నో ఆరోపణలు, మరెన్నో పోరాటాల తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్న వినేశ్ అనూహ్య రీతిలో సెమీఫైనల్లో పరాజయం పాలైంది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మహిళల 53 కేజీల సెమీఫైనల్ బౌట్లో వినేశ్ 4–6 పాయింట్ల తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో ఓడిపోయింది. ప్రతి పాయింట్ కోసం ప్రాణం పెట్టానుఈ నేపథ్యంలో..‘నేను విఫలమయ్యానని భావించడం లేదు. నేను మ్యాట్‌పై కేవలం ప్రత్యర్థితో మాత్రమే పోరాడటం లేదు... మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. ప్రతి పాయింట్ కోసం ప్రాణం పెట్టాను. నాకు సరైన అవకాశం లభించలేదు. నాతో పోటీపడి గెలిచిన రెజ్లర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. వాళ్లు నాతో బౌట్లో పాల్గొనాలని కలలు కన్నారు. నేను తప్పక తిరిగి వస్తా’ అని వినేశ్ భావోద్వేగానికి గురైంది. అదే సమయంలో.. ‘నేను ఓడిపోయానని తెలిసి డబ్ల్యూఎఫ్ఐ అధికారులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.నా చావును కోరుకుంటున్నారు.. నేను మొండిదాన్నిపర్లేదు.. ఇప్పుడు వాళ్లను సెలబ్రేట్ చేసుకోనివ్వండి. నేను చాలా మొండిదాన్ని. నాకు పట్టుదల ఎక్కువ. ఇలాంటి చేదు అనుభవాలే నన్ను మరింత వేగంగా ముందుకు నడిపిస్తాయి. ఇవే నా ప్రయాణానికి ఇంధనాలు. నేను కచ్చితంగా తిరిగి వస్తా.నా ప్రతిభపై సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా ప్రదర్శనతోనే సమాధానం చెప్తా. నేను వీలైనంత త్వరగా చావాలని ఈ రెజ్లింగ్ సమాఖ్య కోరుకుంటోంది. ప్రస్తుతానికైతే వారి ఆలోచన ఇదే’ అని వినేశ్ సంచలన ఆరోపణలు చేసింది. IANSతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.తీవ్ర గందరగోళంకాగా ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ తొలి రౌండ్లో వినేశ్ 7–1తో జ్యోతిపై అలవోక విజయం సాధించింది. దీంతో వినేశ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. ఇక క్వార్టర్ ఫైనల్లో వినేశ్ 7–6 పాయింట్ల తేడాతో నిషు కుమారిని ఓడించింది. ఈ బౌట్ జరుగుతున్న సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది.భారత బృందంలో వీరికి చోటువినేశ్ పదే పదే రిఫరీ నిర్ణయాన్ని సవాలు చేయడం... ఆమె అభిమానులు నినాదాలతో హోరెత్తించడం... టెక్నికల్ ఇబ్బందులు ఇలా విజేతను నిర్ణయించేందుకు చాలా సమయం పట్టింది. మరోవైపు.. సెమీస్‌లో వినేశ్‌పై గెలిచిన మీనాక్షి... తుది పోరులో అంతిమ్ చేతిలో ఓడిపోయింది. అంతిమ్‌తో పాటు నిషా దహియా (68 కేజీలు), మనీషా (57 కేజీలు), దీపాన్షి (50 కేజీలు) ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్ టెండుల్కర్ -
టీమిండియా నుంచి సూర్యకుమార్ అవుట్..? వైభవ్‌కు ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా బిజీ షెడ్యూల్‌పై పడింది.ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత 'మెన్ ఇన్ బ్లూ' వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్ట్, మూడు వన్డేల సిరీస్‌లతో భారత్ తలపడనుంది.ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టీమిండియా పర్యటించనుంది. అయితే ఈ ఏడాది భారత్‌కు అత్యంత కీలకమైన టోర్నమెంట్లలో ఆసియా క్రీడలు (Asian Games) ఒకటి. ఈ ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్నాయి. అయితే ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.'అమర్ ఉజాలా' కథనం ప్రకారం.. ఈ జాబితాలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కపోయినట్లు తెలుస్తోంది. కానీ ఐపీఎల్లో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు సదరు వార్త పత్రిక తమ కథనంలో పేర్కొంది.వైభవ్‌తో పాటు యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ ఏడాది ఆసియా గేమ్స్‌లో ఆడనున్నట్లు సమాచారం. కాగా ఈ 30 మంది జాబితా నుంచే తుది 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ ఆసియా క్రీడల కోసం జట్టును ప్రకటించడానికి జూన్ 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు సమాచారం.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీ సమయంలోనే భారత సీనియర్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య విండీతో 5 టీ20లు, 3 వన్డేలు టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 27న టీమిండియా విండీస్ పర్యటన ప్రారంభం కానుంది.అయితే తొలుత వన్డే సిరీస్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 6 నుంచి టీ20లు మొదలు కానున్నాయి. ఈ సిరీస్ సమయానికి అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు జపాన్ టూర్‌ను ముగించుకుని భారత జట్టుతో చేరే అవకాశముంది.ఆసియా క్రీడలు 2026 కోసం ప్రాబుబుల్స్ లిస్ట్(అమర్ ఉజాలా ప్రకారం)తిలక్ వర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రానా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, ప్రసిద్ద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, అనుకుల్ రాయల్, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, హర్ష్ దూబే, యష్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ, రిషబ్ పంత్ -
ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేశ్‌కు అనుమతి
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే ట్రయల్స్‌లో వినేశ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నియమించే స్వతంత్ర పరిశీలకుడి పర్యవేక్షణలో ఈ ట్రయల్స్ జరుగుతాయి. వీటిని వీడియో రికార్డింగ్ కూడా చేయనున్నారు. ఇటీవల యూపీలోని గోండాలో జరిగిన జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో తనను అనుమతించకుండా డబ్ల్యూఎఫ్ఐ పలు అడ్డంకులు సృష్టించడంతో వినేశ్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై జరిగిన చర్చలో భాగంగా డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారశైలిని కోర్టు తప్పు పట్టింది. డబ్ల్యూఎఫ్ఐ ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, వినేశ్లాంటి దిగ్గజ ప్లేయర్ పట్ల వివక్ష చూపించడంలో అర్థం లేదని కోర్టు అభిప్రాయ పడింది. బిడ్డకు జన్మనిచ్చిన కారణంగా మహిళా క్రీడాకారిణులకు సహజంగా వచ్చే విరామాన్ని పట్టించుకోకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. -
ఆసియా క్రీడలకు సురేఖ, చికిత, ధీరజ్, గణేశ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ప్రకటించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ... తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత.. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్... పురుషుల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన తిరుమూరు గణేశ్ మణిరత్నం భారత జట్టులోకి ఎంపికయ్యారు. మూడు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ అనంతరం భారత జట్లను ఎంపిక చేశారు. వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి... దీపిక భర్త, భారత మాజీ నంబర్‌వన్ అతాను దాస్... వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పాల్గొనడంతోపాటు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలు నెగ్గిన అభిషేక్ వర్మ ట్రయల్స్‌లో విఫలమై ఆసియా క్రీడలకు ఎంపిక కాలేకపోయారు. ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ 15.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా వరుసగా నాలుగో ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచిన ప్రపంచ యూత్ చాంపియన్ చికిత, మూడో స్థానంలో నిలిచిన ప్రీతిక కూడా ఆసియా క్రీడలకు ఎంపికయ్యారు. పురుషుల కాంపౌండ్ విభాగంలో గణేశ్ 10.75 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం పొందాడు. గణేశ్‌తోపాటు సాహిల్ జాధవ్, కుశాల్ దలాల్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. సర్వీసెస్ తరఫున పోటీపడ్డ ధీరజ్ రికర్వ్ విభాగంలో 15.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. -
ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన
భారత జట్టు ఎంపికలో ర్యాంకింగ్స్, అంతర్జాతీయ ప్రదర్శనలకంటే తమ సెలక్షన్ ట్రయల్స్‌కే ప్రాధాన్యతనిస్తామని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) స్పష్టం చేసింది. ట్రయల్స్‌లో సత్తా చాటితేనే టీమ్‌లో చోటు దక్కుతుందని, ర్యాంక్‌ను పరిగణనలోకి తీసుకోమని ఏడాది క్రితం తాము రూపొందించిన విధానాన్ని వెల్లడించింది. ‘నంబర్ వన్’కు చోటే లేదు!ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ‘షాట్‌గన్’ టీమ్‌లను ఎన్ఆర్ఐఏ ప్రకటించింది. అయితే ఇందులో ఆసియా నంబర్‌వన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉన్న ట్రాప్ షూటర్ జొరావర్ సింగ్ సంధూకు చోటు దక్కలేదు.గత ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అతను నిలకడగా రాణిస్తున్నా... ఇటీవల జాతీయ చాంపియన్‌షిప్, సెలక్షన్ ట్రయల్స్‌లోలో ప్రదర్శన బాగా లేకపోవడంతో జొరావర్‌ను తప్పించారు. నెల రోజుల క్రితమే జొరావర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్నాడు. గత అక్టోబర్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన 47 ఏళ్ల జొరావర్ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం నెగ్గిన మూడో భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. గత నెలలో కేవలం స్కోరింగ్ పాయింట్ల కోసమే పాల్గొన్న వరల్డ్ కప్‌లో కూడా జొరావర్ 119 పాయింట్లతో భారత షూటర్లలో అందరికంటే మెరుగైన స్కోరు సాధించాడు. నా ఘనతను గుర్తించాలని కోరుతున్నాఇక 2025 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా 122 పాయింట్లతో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. తమ నిర్ణయాన్ని ఎన్ఆర్ఏఐ పునఃసమీక్షించాలని జొరావర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. ‘ఆసియా నంబర్‌వన్‌గా, వరల్డ్ నంబర్ 6గా ఉన్న నా ఘనతను గుర్తించాలని కోరుతున్నా. గత ఆరు నెలలుగా నేను ట్రాప్‌లో అత్యుత్తమ స్కోరింగ్‌లు నమోదు చేశాను’ అని జొరావర్ అన్నాడు. ఎంపిక చేసే ప్రసక్తే లేదుఅయితే ఎన్ఆర్ఏఐ మాత్రం ఇవేమీ పరిగణనలోకి తీసుకోమని చెబుతోంది. ఎలాంటి మార్పూ లేకుండా ప్రస్తుతం ప్రకటించిన జట్టే 99 శాతం బరిలోకి దిగుతుందని ఎన్ఆర్ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల పేరు ప్రతిష్టలను బట్టి ఎంపిక ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. టీమ్‌లోకి ఎంపికైన ఇతర ‘షాట్‌గన్’ షూటర్ల స్కోరింగ్ అంతర్జాతీయ స్థాయిలో జొరావర్‌కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో రిజ్వీ (122), హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ (119), శపథ్ భరద్వాజ్ (118) స్కోరు సాధించారు. 35 ఏళ్ల కైనన్ మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనున్నాడు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన కైనన్ 36వ స్థానంలో నిలిచాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కైనన్ కాంస్య పతకాన్ని సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కైనన్... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం... ప్రపంచకప్‌లలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి నాలుగు పతకాలు గెలిచాడు. భారత ‘షాట్‌గన్’ జట్ల వివరాలు పురుషుల ట్రాప్: కైనన్ చెనాయ్, అహ్వర్ రిజ్వీ, శపథ్ భరద్వాజ్. మహిళల ట్రాప్: నీరూ, మనీషా కీర్, ఆషిమా అహ్లావత్. పురుషుల స్కీట్: అనంత్‌జీత్ సింగ్, భవ్‌తేజ్ గిల్, మేరాజ్ అహ్మద్ ఖాన్. మహిళల స్కీట్: పరీనాజ్ ధలివాల్, రైజా ఢిల్లాన్, మహేశ్వరి చౌహాన్. ట్రాప్ ‘మిక్స్డ్’: కైనన్ చెనాయ్, నీరూ. స్కీట్ ‘మిక్స్డ్’: అనంత్‌జీత్ సింగ్, పరీనాజ్ ధలివాల్. చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు


