Asifnagar
-
బెయిల్ ఇప్పిస్తాడు... స్నాచింగ్స్ చేయిస్తాడు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసిన ఘరానా స్నాచర్ మహ్మద్ ఫైజల్ షా అలీ జాబ్రీ విషయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇతడి వెనుక ఉండి కథ నడిపేది మహ్మద్ ఖలీల్‌గా తేలింది. వీరిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన శాలిబండ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫైజల్ సోదరుడు పేరున్న వైద్యుడు. ఇంటర్మీడియట్ మధ్యలో మానేసిన ఇతగాడు కొన్నాళ్లు పంజగుట్టలోని ఓ బ్యాంక్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేశాడు. వ్యసనాలకు బానిసగా మారి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2006 నుంచి చైన్ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టి ఇప్పటి వరకు 138 గొలుసులు తెంపాడు. రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా నమోదైంది. ఇతడు జైల్లో ఉండగా మరో ఘరానా స్నాచర్ ఖలీఫాతో పరిచయమైంది. ఇలా ఖలీఫాను కలవడానికి వచ్చే అతడి సోదరుడు ఖలీల్తోనూ స్నేహం చేశాడు. సింగిల్‌గా చైన్ స్నాచింగ్స్ చేసే ఫైజల్ విషయం తెలిసిన ఖలీల్ అతడిని అడ్డు పెట్టుకుని తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడం కోసం అతడికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చాడు. ఇప్పటి వరకు ఫైజల్‌కు రెండుసార్లు బెయిల్ ఇప్పించిన ఖలీల్ అతడికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు చైన్ స్నాచింగ్స్ చేసేలా ప్రోత్సహించాడు. ఇలా తెచ్చిన గొలుసులను అమ్మగా వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకోవడం మొదలెట్టాడు. గతంలో సుల్తాన్‌బజార్ పోలీసులు ఫైజల్‌ను అరెస్టు చేసినప్పుడు కొన్ని నేరాలు చెప్పకుండా చేసి ఆ సొత్తు కాజేశాడు. ఖలీల్ పైనా రెండు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఒంటరిగా బైక్‌పై సంచరిస్తూ స్నాచింగ్స్ చేసే ఫైజల్ మహిళల మెడలోని గొలుసులు లాగడంలో సిద్ధహస్తుడు. బాధితురాలికి ఏమాత్రం గాయం కాకుండా గొలుసు తెంపేస్తాడు. నేరం చేయడానికి వెళ్లేప్పుడే తనతో మరో షర్ట్ తీసుకువెళ్తాడు. స్నాచింగ్ చేసిన తర్వాత అనువైన ప్రాంతంలో ఆగి చొక్కా మార్చుకుంటాడు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసినా చిక్కకుండా ఉండేందుకు వీలున్నంత వరకు ప్రధాన రహదారిని వాడడు. రెక్కీ లేకుండా నేరం చేయడం, చొక్కా మార్చుకోవడంతో పాటు గల్లీల్లో తిరుగుతూ తప్పించుకునే ఇతడి ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు ముప్పతిప్పలు పడాల్సి వస్తుంది. ఇటీవల శాలిబండ, నారాయణగూడ, సరూర్నగర్ల్లో మూడు స్నాచింగ్స్ చేసిన ఫైజల్‌తో పాటు సహకరించిన ఖలీల్‌ను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ చాకచక్యంగా పట్టుకుని 120 గ్రాముల బంగారం రికవరీ, నేరాలకు వాడే పల్సర్ బైక్ రికవరీ చేసింది. (చదవండి: 12 సీసీకెమెరాలు పెట్టినా...రూ.40 లక్షలు స్వాహా) -
పాతబస్తీలో గ్యాంగ్‌వార్.. ఉద్రిక్తత
-
పాతబస్తీలో గ్యాంగ్‌వార్.. ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ పరిధిలో గల ఆసిఫ్‌నగర్ మురాద్‌నగర్‌లో అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదో విషయమై ఒకే ప్రాంతానికి చెందిన రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. రెండు గ్యాంగ్‌లు తలపడిన ఈ గొడవలో 5 షాపులతో పాటు ఆరు కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. మాటా మాటా పెరిగిపోవడంతో రెండు గ్యాంగ్‌లు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో విచక్షణారహితంగా పరస్పర దాడులకు దిగాయి. ఈ వివాదంలో ఒక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు మురాద్‌నగర్‌లో భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గొడవ తలెత్తడానికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్నారిపై లైంగిక దాడి
హైదరాబాద్: అభం శుభం తెలయని చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన నగరంలోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. మెహదీపట్నం గుడిమల్కాపూర్‌కు చెందిన బాలిక(9)పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు ఈరోజు ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
అసిఫ్నహర్ కాల్వ పరిశీలన
శాలిగౌరారం : నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి చెరువు నుంచి శాలిగౌరారం మండలంలోని ఐదు గ్రామాల చెరువులను నింపే అసిఫ్నహర్ కాల్వను రాష్ట్ర నీటిపారుదల శాఖ చీప్ ఇంజనీర్ సురేశ్‌కుమార్ శనివారం పరిశీలించారు. కాల్వతో పాటు ఆయా గ్రామాల్లోని చెరువులు, వాటి కింద సాగు విస్తీర్ణం, కాల్వ నిర్మాణానికి కావాల్సిన భూమి తదితర విషయాలను సంబంధిత జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసిఫ్నహర్ కాల్వ ద్వారా నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి, నక్కలపల్లిపాటు శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ, తక్కెళ్లపహాడ్, ఆకారం, వల్లాల, పెర్కకొండారం గ్రామాల పరిధిలోని చెరువులను నింపవచ్చన్నారు. ఆయా చెరువుల కింద సుమారు 3 వేల ఎకరాలు సాగులోకి రానుందని తెలిపారు. ఆయనవెంట నీటి పారుదలశాఖ ఎస్ఈ ధర్మానాయక్, ఈఈ సుందర్నాయక్, డీఈఈ లింగయ్య, ఏఈ చంద్రశేఖర్, సింగిల్‌విండో చైర్మన్ లోకసాని రంగారెడ్డి, నాయకులు అయితగోని వెంకన్న, భూపతి వెంకన్న, ఈదులకంటి యాదయ్య, పులిగిళ్ళ శంకరయ్య తదితరులు ఉన్నారు. -
బిర్యానీ కోసం దొంగతనాలు!
బంజారాహిల్స్ : బిర్యానీలు తినడానికి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు ఇద్దరు బాలురు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫీల్‌ఖానా మల్లేపల్లి ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో నివసించే బాలుడు(17), ఆసిఫ్‌నగర్‌లోని ఓ పాఠశాలలోని పదో తరగతి చదువుతున్న విద్యార్థి(16) ఇద్దరూ స్నేహితులు. వీరికి రోజూ హోటల్‌కి వెళ్లి బిర్యాని తినడం అలవాటు. అయితే బిర్యానీకి డబ్బులు లేకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. గత కొంతకాలంగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని వారి సెల్ఫోన్లను తస్కరిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు సెల్ఫోన్లతోపాటు ఒక బైక్‌ను కూడా చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్రైం పోలీసులు రంగంలోకి దిగి వీరిపై ప్రత్యేక నిఘా పెట్టి మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. విచారించగా ప్రతిరోజూ తమకు బిర్యానీ తినడం అలవాటని.. ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి హోటల్‌కి వెళ్లి బిర్యానీ తినడం, కూల్‌డ్రింక్‌లు తాగడం ఇష్టమని వివరించారు. ఇందుకోసమే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కూడా తెలిపారు. నిందితులిద్దరినీ జువైనల్ హోమ్‌కు తరలించి కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
బైక్ నడిపి చూస్తానని ఎత్తుకెళ్లాడు!
హైదరాబాద్: టెస్ట్ డ్రైవ్ కోసమంటూ వచ్చిన ఓ దుండగుడు.. మెకానిక్‌పై కత్తితో దాడి చేసి బైక్‌తో పరారయ్యాడు. అత్తాపూర్‌లోని ద్వారకా హోండా షోరూమ్‌లో ఆసిఫ్‌నగర్‌కు చెందిన అఖ్తర్ (27) మెకానిక్. సోమవారం సాయంత్రం ఓ యువకుడు షోరూమ్‌కు వచ్చాడు. తాను సీబీఆర్ 250 సీసీ బైక్ కొనేందుకు వచ్చానని, చూపించమని అడిగాడు. అఖ్తర్ అతనికి బైక్‌ను చూపించగా... ఆ యువకుడు టెస్ట్‌డ్రైవ్ చేస్తానని కోరాడు. దీంతో షోరూమ్ అధికారుల అనుమతితో టెస్ట్‌డ్రైవ్‌కు దుండగుడు అఖ్తర్‌ను వెంటపెట్టుకొని వెళ్లాడు. పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 170 వద్దకు వెళ్లగానే.. బండిని ఆపి అఖ్తర్‌ను కిందకు దిగాలని కోరాడు. ఎందుకని ప్రశ్నించగా దిగమని గద్దించాడు. దిగగానే తల్వార్‌ను బయటకు తీసి అఖ్తర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి.. బైక్ తీసుకొని రాజేంద్రనగర్ వైపు పరారయ్యాడు. అఖ్తర్ కుడిచేతితో పాటు చాతిపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న షోరూమ్ నిర్వాహకులు బాధితుడిని హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.