బిర్యానీ కోసం దొంగతనాలు!
బంజారాహిల్స్ : బిర్యానీలు తినడానికి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు ఇద్దరు బాలురు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫీల్‌ఖానా మల్లేపల్లి ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో నివసించే బాలుడు(17), ఆసిఫ్‌నగర్‌లోని ఓ పాఠశాలలోని పదో తరగతి చదువుతున్న విద్యార్థి(16) ఇద్దరూ స్నేహితులు. వీరికి రోజూ హోటల్‌కి వెళ్లి బిర్యాని తినడం అలవాటు. అయితే బిర్యానీకి డబ్బులు లేకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. గత కొంతకాలంగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని వారి సెల్‌ఫోన్లను తస్కరిస్తున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు సెల్‌ఫోన్లతోపాటు ఒక బైక్‌ను కూడా చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్రైం పోలీసులు రంగంలోకి దిగి వీరిపై ప్రత్యేక నిఘా పెట్టి మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. విచారించగా ప్రతిరోజూ తమకు బిర్యానీ తినడం అలవాటని.. ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి హోటల్‌కి వెళ్లి బిర్యానీ తినడం, కూల్‌డ్రింక్‌లు తాగడం ఇష్టమని వివరించారు. ఇందుకోసమే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కూడా తెలిపారు. నిందితులిద్దరినీ జువైనల్ హోమ్‌కు తరలించి కేసు దర్యాప్తుచేస్తున్నారు.