asocham study
-
దేశంలో విద్యుత్ కష్టాలు పోవాలంటే..ఈ పనిచేయాల్సిందే!
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్ కష్టాలు ప్రత్యేకించి వేసవి కాలంలో తొలగిపోవాలంటే బొగ్గు సుంకం రహిత దిగుమతికి అనుమతించాలని పారిశ్రామిక సంస్థ– అసోచామ్ స్పష్టం చేసింది. దీనితోపాటు బొగ్గు రవాణా చేయడానికి రైల్వే రేక్‌ల లభ్యత భారీగా పెరగాలని, క్యాప్టివ్ జనరేటర్లకు డీజిల్ వేర్వేరు ధరలకు లభ్యమయ్యేలా చూడాలని కోరింది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు... ► విద్యుత్ సరఫరాలో వాణిజ్య వినియోగదారులతో విభేదాలు లేకుండా చూసుకోవాలని మేము రాష్ట్రాలు, డిస్కమ్‌లను కోరతాము. ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం ఆర్థిక పునరుద్ధరణ ఉన్నప్పటికీ పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ఇంకా మందగమనంలోనే ఉంది. ► ప్రపంచ సరఫరా పరిమితులు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు, డిస్కమ్‌లు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ►ప్రస్తుతం బొగ్గుపై దిగుమతి సుంకం 2.5 శాతం ఉన్నప్పటికీ, ఒత్తిడి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి సుంకాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాము. ►భారతదేశానికి ఆస్ట్రేలియా నుంచి ప్రధానంగా బొగ్గు దిగుమతి అవుతోంది. ఇటీవల ఆ దేశంతో భారత్‌కు కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దేశ మధ్య, దీర్ఘకాలిక బొగ్గు సరఫరాల సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని భావిస్తున్నాం. తగిన బొగ్గు సరఫరాలు దేశంలో సకాలంలో అందేలా చర్యలు అవసరం. ►అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే అదనపు సాధారణ హీట్‌వేవ్ వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ►వర్షాలకు ఇంకా చాలా కాలం ఆగాల్సిన పరిస్థితి. విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్రాలు, పరిశ్రమలు సంయుక్తంగా నిరంతరం పర్యవేక్షణతో పరిస్థితిని నిర్వహించాల్సిన ఉంటుంది. ►ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై అసోచామ్ ఇప్పటికే సభ్యులపై సంప్రతింపులు జరిపింది. ఆయా అంశాలను ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. ►డిస్కమ్‌ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కేంద్రం ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ►ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేవలం దృష్టి సారిస్తే సరిపోదు. పంపిణీకి సంబంధించి కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర, రాష్ట్రాలు పరిష్కరించాలి. అయితే, కేంద్రం ఈ దిశలో అనేక చర్యలతో ముందుకు వస్తోంది. వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు రాష్ట్రాల సహకారం కూడా అవసరం. ఇప్పటికే ప్రధానికి వినతులు... పరిశ్రమ బొగ్గు కొరత సమస్యలను సత్వరం పరిష్కరించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు కొరత వల్ల ఎక్సే్చంజీల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. తయారీ, క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్లపై (సీపీపీ) ఆధారపడే సంస్థలు, 10 పరిశ్రమల అసోసియేషన్లు కలిసి ఈ మేరకు ప్రధానికి సంయుక్తంగా ఒక వినతిపత్రం సమర్పించాయి. బొగ్గు సరఫరా సుదీర్ఘ సమయంగా తగ్గిపోవడం వల్ల అల్యుమినియం, సిమెంటు, ఉక్కు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.పరిశ్రమ వర్గాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీపీలు, ఉక్కు, సిమెంటు, స్పాంజ్ ఐరన్ వంటి రంగాలకు బొగ్గు సరఫరా 32 శాతం వరకూ తగ్గిపోయింది. -
ఆర్థిక వ్యవస్థపై ‘రాజకీయ’ నీడ!
న్యూఢిల్లీ: రానున్న ఏడాదిన్నర కాలంలో ఆర్థిక వ్యవస్థపై రాజకీయ అంశాల ప్రభావం అధికంగా ఉండొచ్చని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. ప్రధానంగా 2018లో పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటమే దీనికి కారణమని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో 2018 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో పలు ప్రజాకర్షక నిర్ణయాలకు ఆస్కారం ఉందని కూడా అభిప్రాయపడింది. ‘2019 లోక్ సభ ఎన్నికలకు ముందు వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల ప్రీ–ఫైనల్స్ జరగబోతున్నాయి. ఇందులో రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పలు ప్రజాకర్షక చర్యలను ప్రకటించడం ఖాయం’ అని అసోచామ్ పేర్కొంది. ఇక ప్రజలపై ప్రతికూల సెంటిమెంటుకు దారితీసే కార్మిక చట్టాల ప్రక్షాళన వంటి కఠిన సంస్కరణలకు ఆస్కారం లేదని దేశీ కార్పొరేట్లు భావిస్నున్నాయని తెలిపింది. జీఎస్టీ రేట్లు మరింత తగ్గొచ్చు... ప్రస్తుత రాజకీయ–ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే... వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) రేట్లలో రానున్న రోజుల్లో మరింత స్థిరీకరణకు ఆస్కారం ఉందని అసోచామ్ అభిప్రాయపడింది. పన్ను రేట్లల్లో ఇంకాస్త తగ్గుదల ఉండొచ్చని పేర్కొంది. ‘వ్యాపార వర్గాలకు జీఎస్టీ జమానా మింగుడుపడటం లేదు. తాజా గుజరాత్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షాలన్నీ దీన్నే తమ అస్త్రంగా మలచుకున్నాయి. వచ్చే ఏడాది కీలక రాష్ట్రాల ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో కేంద్రం దీనిపై దృష్టిసారించే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనల్లో చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)లకు కూడా ఊతం లభించవచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారీగా ఉద్యోగాలను కల్పించే విషయంలో మోదీ సర్కారు కొంత ఆందోళనకు గురవుతోంది. అందుకే వీటికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నాం. ఇక రైతులు, గ్రామీణ రంగాలు, వ్యవసాయ ఆధార మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి అనేక చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంతో ముడిపడిన కంపెనీలకు ఇది చాలా ప్రయోజనకరమైన అంశం’ అని అసోచామ్ వివరించింది. గత వారం హీరోలు ఎందుకు పెరిగాయంటే... హైదరాబాద్ ప్లాంట్‌కు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఈఐఆర్‌ను పొందడంతో డాక్టర్ రెడ్డీస్ ఫార్మా షేర్ 9 శాతం దూసుకుపోయింది. వాహనాల ధరలను 3 శాతం వరకూ పెంచనుండటంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 7 శాతం ఎగసింది. గతంలో పెట్‌కోక్ వినియోగంపై విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్ట్ తొలగించడంతో పెట్‌కోక్‌ను ఇంధనంగా వినియోగించే అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్ వంటి సిమెంట్ రంగ షేర్లు 3–4 శాతం రేంజ్లో పెరిగాయి. గత వారం జీరోలు ఎందుకు తగ్గాయంటే... భారతీ ఎయిర్టెల్ వాటా విక్రయం కారణంగా ఈ వారం కూడా భారతీ ఇన్ఫ్రాటెల్ నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్ నుంచి తొలగిస్తుండటంతో సిప్లా షేర్ 5% పతనమైంది. అంతకు ముందటి వారం బాగా పెరిగిన నేపథ్యంలో గత వారం లాభాల స్వీకరణతో అశోక్ లేలాండ్, సెయిల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, పిరమళ్ ఎంటర్ప్రైజెస్ షేర్లు 3–4 శాతం రేంజ్లో నష్టపోయాయి. నిధుల సమీకరణ వ్యయం వచ్చే ఏడాది పెరుగుతుందన్న ఆర్ఈసీ సీఎండీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్ఈసీ షేర్ 4% పడింది. -
నిమిషానికి రూ. 16 కోట్ల ఆదాయం!
ఇప్పుడు పిన్నీసు నుంచి కారు వరకు ఏది కావాలన్నా ఆన్లైన్లోనే చూస్తున్నాం. దుస్తులు కావాలన్నా, సెల్‌ఫోన్ కొనాలన్నా, చివరకు పప్పు-ఉప్పులు, రోటీలు.. ఇలా అన్నింటికీ ఈ-కామర్స్ సైట్లు ఉపయోగపడుతున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ సైట్లకు వస్తున్న ఆదాయం ఎంతో తెలుసా? నిమిషానికి అక్షరాలా 16 కోట్ల రూపాయలు. ఇందులో కూడా ఎక్కువ భాగం సోషల్ మీడియా ద్వారానే వస్తోందని అసోచామ్ - డెలాయిట్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తెలిసింది. ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్.. ఈ మూడింటి నుంచి నిమిషానికి రూ. 18.66 లక్షల ఆదాయం వస్తోంది. ఇది పైన చెప్పిన రూ. 16 కోట్లకు అదనం. సోషల్ మీడియా జనసామాన్యంలోకి విస్తృతంగా చొచ్చుకుపోవడం, ఆన్లైన్ అమ్మకాలకు కూడా అది ప్రతోత్సాహకరంగా ఉండటంతో వాటి ద్వారా కూడా మంచి ఆదాయం ఉంటోందని సర్వేలో తేలింది. మార్కెట్లో ఉన్న కొత్త ఉత్పత్తుల గురించి వాటి ఫేస్బుక్ పేజీల ద్వారా సమాచారం అందడంతో పాటు యూజర్ల సమీక్షలు, ఆ ఉత్పత్తి గురించిన అభిప్రాయాలు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. దాంతో.. అసలు ఏం కొనాలో, ఏవి అక్కర్లేదో కూడా సులభంగా నిర్ణయించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను కూడా సోషల్ మీడియా ద్వారా ఈ-టైలర్లు ప్రకటిస్తుండటంతో.. ఈ-కామర్స్ సంస్థల ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది.