నిమిషానికి రూ. 16 కోట్ల ఆదాయం!
ఇప్పుడు పిన్నీసు నుంచి కారు వరకు ఏది కావాలన్నా ఆన్లైన్లోనే చూస్తున్నాం. దుస్తులు కావాలన్నా, సెల్ఫోన్ కొనాలన్నా, చివరకు పప్పు-ఉప్పులు, రోటీలు.. ఇలా అన్నింటికీ ఈ-కామర్స్ సైట్లు ఉపయోగపడుతున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ సైట్లకు వస్తున్న ఆదాయం ఎంతో తెలుసా? నిమిషానికి అక్షరాలా 16 కోట్ల రూపాయలు. ఇందులో కూడా ఎక్కువ భాగం సోషల్ మీడియా ద్వారానే వస్తోందని అసోచామ్ - డెలాయిట్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తెలిసింది. ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్.. ఈ మూడింటి నుంచి నిమిషానికి రూ. 18.66 లక్షల ఆదాయం వస్తోంది. ఇది పైన చెప్పిన రూ. 16 కోట్లకు అదనం.
సోషల్ మీడియా జనసామాన్యంలోకి విస్తృతంగా చొచ్చుకుపోవడం, ఆన్లైన్ అమ్మకాలకు కూడా అది ప్రతోత్సాహకరంగా ఉండటంతో వాటి ద్వారా కూడా మంచి ఆదాయం ఉంటోందని సర్వేలో తేలింది. మార్కెట్లో ఉన్న కొత్త ఉత్పత్తుల గురించి వాటి ఫేస్బుక్ పేజీల ద్వారా సమాచారం అందడంతో పాటు యూజర్ల సమీక్షలు, ఆ ఉత్పత్తి గురించిన అభిప్రాయాలు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. దాంతో.. అసలు ఏం కొనాలో, ఏవి అక్కర్లేదో కూడా సులభంగా నిర్ణయించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను కూడా సోషల్ మీడియా ద్వారా ఈ-టైలర్లు ప్రకటిస్తుండటంతో.. ఈ-కామర్స్ సంస్థల ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది.