Aspirations of the people
-
‘హోదా’ ఉద్యమంపై ఉక్కుపాదం
ఎస్వీ వర్సిటీలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సదస్సుకు అనుమతి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: ఉద్యమ రూపం దాలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక హోదా కోసం గళం విప్పుతున్న గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రజల ఆకాంక్షల మేరకు అందరినీ కలుపుకుపోయి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేకహోదాను సాధించుకు రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... ఈ అంశంపై పోరాట దృక్పథాన్ని ఎంచుకున్న ప్రతిపక్ష పార్టీకి ఆటంకాలు కలిగిస్తూ అమానుషంగా వ్యవహరిస్తోంది. తిరుపతి ఎస్వీవర్సిటీ ప్రాంగణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఈ నెల 15న నిర్వహించ తలపెట్టిన సదస్సుకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సదస్సును పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించడానికి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సన్నద్ధమవుతోంది. జగన్ పాల్గొననున్నారని తెలిశాకే... తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో ఈ నెల 15వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నిర్వహించ తలపెట్టిన ‘రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా ఆవశ్యకత’ సదస్సుకు మొదట ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని, ‘ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు- రాష్ట్ర అభివృద్ధి’ అనే అంశం గురించి ఆయన ప్రసంగిస్తారనే విషయం తెలియగానే ప్రభుత్వం అనుమతి రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. యూనివర్సిటీల్లో సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించరాదని, ఇందుకు అనుమతులు ఇవ్వరాదని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదివారం ఆగమేఘాలమీద ఆదేశాలు జారీచేశారు. మంత్రి నుంచి ప్రకటన వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తలపెట్టిన సదస్సుకు అనుమతి తిరస్కరిస్తున్నట్లు ఎస్వీ వర్సిటీ అధికారులు ప్రకటించారు. అప్పుడు ముద్దు.. ఇప్పుడు వద్దు! గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదే శం పార్టీ విద్యార్థి విభాగమైన టీఎన్ఎస్ఎఫ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, అన్ని రాజకీయ పార్టీలూ తమ విద్యార్థి విభాగాలను రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు ఇతర పార్టీలు తిరస్కరించాయి. అయితే 2004 ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబు టీఎన్ఎస్ఎఫ్ను పునరుద్ధరించి తమ తీరును చాటుకున్నారు.ఇప్పుడు యూటర్న్ తీసుకుని యూనివర్సిటీలను రాజకీయ వేదికలుగా మార్చవద్దని తెలుగుదేశం నేతలంటున్నారు. వాటికి అనుమతించారు.. : సార్వత్రిక ఎన్నికల సమయంలో గత ఏడాది మే నెలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ ఎన్నికల సభను ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించారు. గత ఏడాది జూన్ 4న చంద్రబాబును టీడీఎల్పీనేతగా ఎన్నుకోవడం కోసం సమావేశాన్ని వర్సిటీ సెనేట్ హాలులో నిర్వహించారు. గత నెలలో ఏఐఎస్ఎఫ్ జాతీయ సభలకు శ్రీనివాస ఆడిటోరియం కేటాయించారు. జూన్ 14వ తేదీన బాహుబలి ఆడియో ఫంక్షన్‌కు అనమతించారు. వీటిని పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నిర్వహించ తలపెట్టిన సదస్సుకు అనుమతి నిరాకరిస్తూ ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తమ ధృక్పథాన్ని ఇలా స్పష్టం చేసింది. -
ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తా
సింధనూరు టౌన్, న్యూస్‌లైన్ : ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతంగా పని చేసి స్వచ్ఛమైన పాలన అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఆయన ఆదివారం సింధనూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. గతంలో పాలన సాగించిన పార్టీల దుష్పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు తమను ఆశీర్వదించారన్నారు. అందువల్ల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఇప్పటికే 60 శాతం నిధులను హైదరాబాద్-కర్ణాటక ప్రాంత అభివృద్ధికి కేటాయించామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక రూపాయికే కిలో బియ్యం అందించే అన్నభాగ్య పథకాన్ని ప్రకటించానన్నారు. వెనుకబడిన, మైనార్టీ వర్గాల రుణాల మాఫీ చేశామన్నారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమన్నారు. అన్నభాగ్య పథకం జారీపై ఎన్నో రకాల ఆటంకాలు ఎదురైనా పథకం అమలుకే కట్టుబడ్డామన్నారు. తక్కువ ధరకు బియ్యం పంపిణీ చేసినంత మాత్రాన ఎవరూ సోమరులు కారన్నారు. పిడికెడు అన్నానికి కూడా నోచుకోలేని అభాగ్యులు ఎందరో ఉన్నారన్నారు. అలాంటి వారి కడుపు నింపేందుకు ఈ పథకం ఎంతో సహాయకారి కానుందన్నారు. పాడి రైతులకు సహాయధనం, విద్యార్థులకు అపౌష్టికత నివారణకు క్షీరభాగ్య పథకం అమలు చేశామన్నారు. రైతుల శ్రేయస్సు కోసం రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందించే పథకం జారీ చేశామన్నారు. ఈ పథకం వల్ల తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించలేని దుస్థితి ఎదుర్కొంటున్న రైతుల జీవితాలు బాగుపడతాయన్నారు. మహిళలకు పలు రకాల సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాకి ఓటర్లు స్వస్తి పలికారన్నారు. ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సామాజిక న్యాయం లభించని, అణచివేతకు గురైన వర్గాల రక్షణకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. హైదరాబాద్-కర్ణాటక వాసుల చిరకాల వాంఛ కూడా నెరవేరిందని, ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఇది తోడ్పడనుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప, శివరాజ్ తంగడిగి, ఎంపీ శివరామగౌడ, ఎమ్మెల్యేలు హంపనగౌడ, ప్రతాప్‌గౌడ పాటిల్, వెంకటేష్ నాయక్, హంపయ్య నాయక్, రాఘవేంద్ర హిట్నాళ, బీఎం నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ బయ్యాపుర, జెడ్పీ అధ్యక్షురాలు లలితమ్మ, ఉపాధ్యక్షుడు శరణప్ప, డీసీసీ అధ్యక్షుడు ఎ.వసంతకుమార్, బసవరాజ్ ఇటగి తదితరులు పాల్గొన్నారు.