సింధనూరు టౌన్, న్యూస్‌లైన్ : ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతంగా పని చేసి స్వచ్ఛమైన పాలన అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఆయన ఆదివారం సింధనూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. గతంలో పాలన సాగించిన పార్టీల దుష్పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు తమను ఆశీర్వదించారన్నారు.
అందువల్ల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఇప్పటికే 60 శాతం నిధులను హైదరాబాద్-కర్ణాటక ప్రాంత అభివృద్ధికి కేటాయించామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక రూపాయికే కిలో బియ్యం అందించే అన్నభాగ్య పథకాన్ని ప్రకటించానన్నారు. వెనుకబడిన, మైనార్టీ వర్గాల రుణాల మాఫీ చేశామన్నారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమన్నారు.
అన్నభాగ్య పథకం జారీపై ఎన్నో రకాల ఆటంకాలు ఎదురైనా పథకం అమలుకే కట్టుబడ్డామన్నారు. తక్కువ ధరకు బియ్యం పంపిణీ చేసినంత మాత్రాన ఎవరూ సోమరులు కారన్నారు. పిడికెడు అన్నానికి కూడా నోచుకోలేని అభాగ్యులు ఎందరో ఉన్నారన్నారు. అలాంటి వారి కడుపు నింపేందుకు ఈ పథకం ఎంతో సహాయకారి కానుందన్నారు. పాడి రైతులకు సహాయధనం, విద్యార్థులకు అపౌష్టికత నివారణకు క్షీరభాగ్య పథకం అమలు చేశామన్నారు. రైతుల శ్రేయస్సు కోసం రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందించే పథకం జారీ చేశామన్నారు.
ఈ పథకం వల్ల తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించలేని దుస్థితి ఎదుర్కొంటున్న రైతుల జీవితాలు బాగుపడతాయన్నారు. మహిళలకు పలు రకాల సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాకి ఓటర్లు స్వస్తి పలికారన్నారు. ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సామాజిక న్యాయం లభించని, అణచివేతకు గురైన వర్గాల రక్షణకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.
హైదరాబాద్-కర్ణాటక వాసుల చిరకాల వాంఛ కూడా నెరవేరిందని, ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఇది తోడ్పడనుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప, శివరాజ్ తంగడిగి, ఎంపీ శివరామగౌడ, ఎమ్మెల్యేలు హంపనగౌడ, ప్రతాప్‌గౌడ పాటిల్, వెంకటేష్ నాయక్, హంపయ్య నాయక్, రాఘవేంద్ర హిట్నాళ, బీఎం నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ బయ్యాపుర, జెడ్పీ అధ్యక్షురాలు లలితమ్మ, ఉపాధ్యక్షుడు శరణప్ప, డీసీసీ అధ్యక్షుడు ఎ.వసంతకుమార్, బసవరాజ్ ఇటగి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తా
Published Mon, Aug 26 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
Advertisement
Advertisement