తాడిపత్రి: ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణంలో దర్జాగా అసాంఘిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవటమే కాకుండా తన అనుచరులతో కలసి కూల్చివేతలకు పాల్పడ్డారు.
శనివారం రాత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనుల వద్ద వీరంగం సృష్టించారు. జేసీ గ్యాంగ్ కూలగొట్టిన పిల్లర్లను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నించిన కార్మికులపై ఆదివారం ఉదయం దాడి చేసేందుకు ప్రయత్నించారు.
ఏం జరిగిందంటే...
నాడు–నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మూడు రోజుల క్రితం చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉంది. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో నిర్మాణ పనుల వద్దకు అనుచరులతో కలసి చేరుకున్న జేసీ ‘రేయ్ జేసీబీతో పిల్లర్లను కూలదోయండిరా..’ అంటూ హుకుం జారీ చేశారు.
జేసీబీతో కాంక్రీట్ పిల్లర్లను కూలదోశారు. మర్నాడు అక్కడకు వచ్చిన కూలీలను పనులు నిలిపి వేయాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అడ్డగించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రహరీ నిర్మిస్తున్నామని, అడ్డు తగలడం సమంజసం కాదని చెప్పినా వినిపించుకోలేదు. దీనిపై మేస్త్రీ గురుశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ నిర్మాణాలను దౌర్జన్యంగా కూలగొట్టడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస మల్లికార్జునరెడ్డి, సుబ్బయ్య, వడ్డే మధు, సోమశేఖర్ నాయుడు, దినేష్‌రెడ్డి, పవన్‌నాయుడు, మునిసిపల్ కాంట్రాక్టర్ తిరుపాల్‌రెడ్డి, కుమ్మరి వెంకటేష్, రాంబాబు, గురుజాల శివశంకర్‌రెడ్డి, చరణ్, హరినాథ్‌రెడ్డి, గండికోట కార్తీక్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment