మంత్రి తీరుతో ఉపాధ్యాయుల మనస్తాపం
విశాఖపట్నం , పాడేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంల డ్రాయింగ్ అధికారాలు ఏటీడబ్ల్యూవోలకు బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 132 జీవో రద్దు కోసం ఆందోళన చేస్తున్న ఆందోళనపై సాక్షాత్తూ గిరిజన సంక్షేమ, వైద్యారోగ్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయుల్ని తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. ఈ 132 జీవోను రద్దు చేయాలని ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏల వద్ద రెండు రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాడేరు ఐటీడీఏ వద్ద ఉపాధ్యాయుల రిలే దీక్షా శిబిరాన్ని మంత్రి శ్రావణ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విధులను వదిలిపెట్టి ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టడాన్ని మంత్రి తప్పుబట్టారు. పాఠశాలల్లో బోధన జరగకపోతే విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుందని, పరీక్షల తరుణంలో ఆందోళన చేయడం సరికాదన్నారు. వారం రోజుల్లో 132 జీవో సమస్యను పరిష్కరిస్తామని, దీక్షలు విరమించాలని మంత్రి శ్రావణ్ అన్నారు.
ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టడం బాధ్యతారాహితమనే భావం మంత్రి మాటల్లో వ్యక్తమైంది. దీంతో ఉపాధ్యాయ సంఘ నేతలు ఆవేదనకు గురయ్యారు. మంత్రి హామీతో దీక్షలు విరమించాలా వద్దా అనే విషయంపై సాయంత్రం వరకు తీవ్ర తర్జనభర్జనలు పడ్డారు. ఆగస్టులో వచ్చిన 132 జీవోను రద్దు చేయాలని హెచ్ఎంలకు డ్రాయింగ్ అధికారాలు యథాతథంగా కొనసాగించాలని నాలుగు నెలల నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలిశామని, గతనెలలోనే మంత్రి శ్రావణ్ దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయిందని ఉపాధ్యాయ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో జారీ అయిన తర్వాత 3 నెలల పాటు నిలుపుదల(అబియాన్స్)లో ఉందన్నారు. ఇతర యాజమాన్యలకు నిలుపుదల కొనసాగిస్తూనే డిసెంబర్ నుంచి తమకు ఈ 132 జీవోను అమల్లోకి తెచ్చారని దీంతో తాము ఆందోళన చేపట్టామని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ జీవో మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు వేతనాలు కూడా పొందలేదన్నారు.132 జీవో రద్దు విషయంలో మంత్రి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిల మధ్య ఆదిపత్యపోరు జరుగుతోందని, రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నారని బాహాటంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం దీక్షా శిబిరం వద్దకు మంత్రి చేరుకున్న కొద్ది సేపటికే ఎమ్మెల్యే కూడా వచ్చారు. దీక్ష విరమింపజేసిన క్రెడిట్ దక్కించుకోవాడానికి ఇద్దరూ తాపత్రయపడ్డారని కొందరు ఉపాధ్యాయులు చర్చించుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యే హామీతో ఉపాధ్యాయులు తాత్కాలికంగా దీక్ష విరమించారు.