కార్మిక గర్జన
కార్మిక గర్జన
Published Fri, Nov 11 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
ఏలూరు (సెంట్రల్,అర్బన్) : జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం కార్మికులు గర్జించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేశారు. ఆశ్రం ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది తమకు జీవో 68 ప్రకారం రూ.9వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో భారీ ర్యాలీ చేశారు. స్థానిక పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజారామ్మోహనరాయ్ మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సిబ్బంది పది రోజుల నుంచి తమ హక్కుల కోసం ఆందోళన చేస్తుంటే యాజమాన్యం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే జీవో నంబర్ 68 ప్రకారం రూ. 9 వేలు వేతనం ఇవ్వాలని, ఏఎంఆర్‌లుగా పదోన్నతులు ఇచ్చి కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సంస్థలో కార్మిక చట్టాలను అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అనంతరం కాంట్రాక్టు సిబ్బంది కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రసాదు, బి.సోమయ్య, పి.కిషోర్, బి.జగన్నాథరావు, గుడిపాటి నర్సింహరావు, వి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
త్రీటౌన్ పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న కార్మిక నాయకులను పోలీసులు అరెస్టు చేసి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నిరసనకారులు త్రీ టౌన్ పోలీసుస్టేషన్‌ను చుట్టుముట్టారు. నాయకులను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. స్టేషన వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో ఇన్‌చార్జ్ టౌన్ సీఐ ఆడపా నాగమురళి త్రీ టౌన్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అరెస్ట్ చేసిన వారిని సొంత పూచీకత్తులపై విడిచిపెడతామని నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇదిలా ఉంటే సీఐటీయూ నాయకుల అరెస్ట్ దారుణమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతకాయల బాబురావు ఒక ప్రకటనలో ఖండించారు.
Advertisement
Advertisement