సాగు నీరందించాలని కౌలు రైతుల ధర్నా
సాగు నీరందించాలని కౌలు రైతుల ధర్నా
Published Mon, Aug 22 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
ఏలూరు (మెట్రో) : సాగు నీరందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వరి దుబ్బలతో కలెక్టరేట్‌లో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరందక వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.10 వేలకుపైగా పెట్టుబడి పెట్టారన్నారు. ప్రస్తుతం సాగునీరందకపోతే అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ నీళ్లు ఇచ్చామంటూ అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు.
నీరు ఇస్తే రైతుల పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తరలిస్తామని హడావిడి చేసి రైతులను పంటలను వేసుకోమన్నారని చుక్కనీరు రాక రైతులు పొలాల గట్ల మీద పడిగాపులు పడుతున్నారని చెప్పారు. గోదావరిలో నీరున్నా వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా డెల్టా శివారు ప్రాంత ఆయకట్టు సాగునీరు అందటం లేదన్నారు. రైతులకు సాగునీరందించి పంటలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు నాయకులు మంతెన రామారావు, తిరుపతి రంగారావు, మావూరి శ్రీనివాసరావు, గొర్రెల సాంబశివరావు, బైరెడ్డి లక్ష్మణరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement