నాట్లు వేశాం.. పంట రుణాలు ఇవ్వండి
నాట్లు వేశాం.. పంట రుణాలు ఇవ్వండి
Published Wed, Aug 10 2016 7:26 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ఏలూరు (సెంట్రల్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. జిల్లాలో 3 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, చట్టప్రకారం భూ యజమానితో సంబంధం లేకుండా అందరికీ రుణార్హత గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉందని జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. అధికారులు చెబుతున్న లెక్కలు వాస్తవ పరిస్థితికి దూరంగా ఉన్నాయని, కార్డుల జారీలో కొందరు సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,200 కోట్లు రుణ లక్ష్యం ప్రకటించినా కౌలు రైతులకు ఒక శాతం కూడా రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. జీవో ప్రకారం ప్రతి కౌలు రైతుకు రూ.లక్ష వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నాయకులు డి.అశోక్‌కుమార్, డీఎన్‌వీడీ ప్రసాద్, జక్కంశెట్టి సత్యనారాయణ, పీవీ రామకృష్ణ ధర్నాకు సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. కౌలు రైతులు కలెక్టరేట్ నుంచి ర్యాలీగా వెళ్లి వ్యవసాయశాఖ జేడీ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యవసాయశాఖ డీడీ, ఆంధ్రా బ్యాంకు ఏజీఎం కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించారు.
Advertisement