అసోం గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు!
గువాహటి: హిందుస్థాన్ హిందువుల దేశమని, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజెన్స్ (ఎన్సీఆర్) ఆధునీకరణలో ఒక్క బంగ్లాదేశీ పేరు కూడా నమోదుచేయకుండా చూడాలని అసోం గవర్నర్ పీబీ ఆచార్య పేర్కొన్నారు. ఓ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సీఆర్ ఆధునీకరణలో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన శరణార్థులకు భారత్లో ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీచేయడంపై వివాదం తలెత్తగా.. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు భారత్లో ఆశ్రయం పొందవచ్చునని, ఇతర దేశాల్లోని హిందువుల్లో భారత్లో ఆశ్రయం పొందడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన పేర్కొన్నారు.
'హిందుస్థాన్ హిందువుల దేశం. ఈ విషయంలో ఏ సందేహాలకు తావు లేదు. వివిధ దేశాల్లోని హిందువులంతా ఇక్కడ నివసించవచ్చు. ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే, వారికి ఎలా ఆశ్రయం కల్పించాలన్నదే పెద్ద ప్రశ్న. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది' అని ఆయన పేర్కొన్నారు.