లోక్‌సభ పోలింగ్ 2 గంటల పొడిగింపు
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సరి కొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ఈ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని రెండు గంటలు పెంచాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయిం చింది. నక్సల్స్ ప్రభావం లేని, కొండ ప్రాంతాల్లోని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఈసీ సమయాన్ని పెంచిందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు 9 గంటల పాటు సాగుతున్న పోలింగ్‌ను రెండు గంటలు పెంచుతారు. దీంతో ఓటు ప్రక్రియ 11 గంటలు సాగుతుంది. నక్సల్స్ ప్రభావం లేని చోట్ల, కొండ ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇదివరకు మాదిరే ఉదయం 7కు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.
అస్సాం ఎన్నికల సన్నాహాల కోసం వెళ్లిన ఈసీ అధికారులు అక్కడి నుంచి తిరిగొచ్చిన రోజున దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తారు. దేశంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరగడం, ఇటీవలి ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదు కావడం, కొన్నిసార్లు పొద్దుపోయేదాకా ఓటర్లు బారులు తీరుతుండడంతో ఈసీ పోలింగ్ సమయాన్ని పెంచింది. ఎన్నికలు వేసవిలో జరగనుండడంతో చాలా మంది ఓటర్లు ఎండ తగ్గాక సాయంత్రం ఓటేసేందుకు వస్తారని, దీంతో క్యూలు పెరుగుతాయని ఈసీ అంచనా.
లాంఛనంగా మొదలైన ఎన్నికల ప్రక్రియ..
కేంద్ర కేబినెట్ సిఫార్సుపై బీహార్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ లాంఛనంగా మొదలైంది. నిజానికి ఈ స్థానాలకు మూడో విడతలో ఏప్రిల్ 10న ఎన్నికలు జరగనున్నా, బీహార్‌లో మార్చి 22న సెలవు, పాలనాపరమైన కారణాల వల్ల తొలి నోటిఫికేషన్ వీటికే జారీ అయింది. కాగా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల ఎన్నికలకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు.
అస్సాంలో పోలింగ్ తేదీల మార్పునకు ఈసీ నో
పండగల కారణంగా అస్సాంలో లోక్‌సభ తొలి రెండు విడతల పోలింగ్ తేదీలను( ఏప్రిల్ 7, 12) మార్చాలని కొన్ని పార్టీలు చేసిన విజ్ఞప్తిని ఈసీ తిరస్కరించింది.