ఉపాధ్యాయుడి దారుణ హత్య
నగదు కోసమేనని అనుమానం
అడవి దారిలో ఘటన
గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్: గూడెం కొత్తవీధి మండలంలో ఓ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి ఉపాధ్యాయుని బంధువులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రింతాడ పంచాయతీ గుర్రాలగొంది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న సీందేరి సోమయ్య (38) స్వగ్రామం మండెం. ఐతే బుధవారం ఆయన గ్రామంలోని బంధువుల వివాహానికి హాజరయ్యాడు.
బుధవారం సాయంత్రం వరకు అక్కడే గడిపాడు. గురువారం ఉదయానే లేచి చింతపల్లిలో నివాసం ఉంటున్న ఇంటికి బయలుదేరాడు. అదే రోజు హత్యకు గురయ్యాడు. గతంలో దామనాపల్లి పంచాయతీ భీమవరం పాఠశాలలో పని చేశాడు. ఈయన ఈ గ్రామం నుంచి చింతపల్లికి వెళ్లేందుకు దగ్గరమార్గం గుండా వెళుతూ హత్యకు గురైనట్లు తెలుస్తోంది.
నగదు కోసమేనా?
సోమయ్య గురువారం మారుమూల అటవీ ప్రాంతం మీదుగా వెళుతుండటం సమీప భీమవరం, కట్టుపల్లి గ్రామానికి చెందిన కొందరు చూశారు. వారే నగదుకోసం హత్య చేసి ఉంటారని అతని భార్య లక్ష్మి భోరున విలపించింది. తన భర్త బంధువుల వివాహానికి వెళుతుండగానే సుమారు రూ.7 వేలు ఖర్చుల నిమిత్తం తీసుకు వెళ్ళారని తెలిపారు. ముందుగానే భార్య, పిల్లలను పంపించేసి తాను తరువాత రోజున మళ్లీ వస్తానని చెప్పారన్నారు.
బుధవారం నుంచి తన భర్త రాకపోవడంతో బంధువులు ఇంటి వద్ద ఆరా తీసినా తెలియరాలేదన్నారు. సోమవారం భీమవరం అటవీ ప్రాంతంలో మృతదేహం గుర్తించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని సోమయ్య బంధువులు తెలిపారు. మృతదేహాన్ని శవపంచనామా అనంతరం స్థానిక తహశీల్దార్ సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మార్వో శ్యాంసుందర్ తెలిపారు.