అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలి
టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టానికి కొన్ని సవరణలు చేస్తే 2019 ఎన్నికలు జరిగేలోపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉండబోదని రెండు రోజుల కిందట రాజ్యసభలో కేంద్రం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలసి వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలసినప్పుడు అసెంబ్లీ సీట్లను పెంచాల్సిందిగా కోరారని వినోద్ చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దానిపై బిల్లు ప్రవేశ పెట్టాలని, 2019లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలున్నందున ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి రాజ్యాంగ సవరణ అవసరమని రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం సరికాదని వినోద్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.