అసెంబ్లీ సీట్ల పెంపు: కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశం అంతటా అసెంబ్లీ సీట్ల పెంపు జరిగినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్ల పెంపు జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ చట్టం ప్రకారం.. ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ సీట్లను పెంచడానికి అవకాశం లేదని తెలిపారు. గత పాలకులు ఏపీ విభజన చట్టంలో ఇష్టం ఉన్నట్లు అనేక అంశాలు పెట్టారని.. అసెంబ్లీ సీట్ల పెంపు అంశం రాత్రికి రాత్రి తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. దేశంలో సీట్ల పెంపు పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆలోచన చేయలేదని, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై న్యాయ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాలపై పెంపుపై మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు.
కశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపు..!
గురువారం ఢిల్లీలో జమ్మూకశ్మీర్ బ్లాక్ లెవల్ ప్రజాప్రతినిధులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ వేగవంతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని స్థానిక నేతలకు పిలుపు నిచ్చారు. ‘మార్చి, ఏప్రిల్ లో జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తా. కశ్మీర్లో అభివృద్ధిని వేగవంతం చేస్తాం. కశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ అంశపై మరింత లోతుగా ఆలోచిస్తున్నాం. దానికి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. మే నెలలో జమ్మూ కశ్మీర్ ఔట్ రీచ్ కార్యక్రమం పెడుతున్నాం. కేంద్ర మంత్రులంతా బ్లాక్ లెవల్‌కు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ పన్నాగాలు పారలేదు. స్థానిక ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించారు.
బాధ్యులపై కఠిన చర్యలు...
ఢిల్లీలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆస్తుల విధ్వంసం, మరణాలకు కారకులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు.