రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్
బడ్జెట్ సమర్పయామీ
అసెంబ్లీలో ఆనం, మండలిలో రామచంద్రయ్య
ప్రణాళిక వ్యయం 67,950 కోట్లు.. ప్రణాళికేతర వ్యయం రూ. 1,15,179 కోట్లు
ఓటాన్ అకౌంట్ మొదటి 6 నెలల కాలానికి రూ. 79,460 కోట్లు వ్యయం
వందశాతం వైకల్యం ఉంటే వెయ్యి రూపాయల పింఛన్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మండలిలో సభా నాయకుడు సి.రామచంద్రయ్య సోమవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.1,83,129 కోట్ల బడ్జెట్లో ప్రణాళిక వ్యయం కింద రూ.67,950 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.1,15,179 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళితం
చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ఓటాన్ అకౌంట్లో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి రూ.79,469 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, పేదల కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను గుర్తు చేశారు. ద్రవ్యలోటు రూ.25,402 కోట్లుగా అంచనా వేయగా, రెవెన్యూ మిగులు రూ.474 కోట్లుగా తేల్చారు. ఎస్సీ, ఎస్టీల సత్వర అభ్యున్నతి కోసం ‘ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాలు, తెగల ఉప ప్రణాళిక ఆర్థిక వనరుల చట్టం’ తీసుకు వచ్చినట్లు వివరించారు. బంగారు తల్లి పథకం కింద బాలికా ప్రోత్సాహాక సాధికారత చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- 2012-13 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.78,564. ఇది దేశ తలసరి ఆదాయం కంటే అధికం.
- రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు గతేడాది 5.78 మాత్రమే.. అయినా వ్యవసాయ (7.78%), సేవా (7.75%) రంగాలు గణనీయ ప్రగతి సాధించాయి.
- పారిశ్రామిక ప్రగతి ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదు.
- 2004-05 ఆర్థిక సంవత్సరంలో 29.9 శాతం ఉన్న పేదరికం.. 2011-12 సంవత్సరానికికల్లా 9.2 శాతానికి తగ్గింది.
- తృణధాన్యాల అభివృద్ధిలో మంచి ప్రగతి సాధించినందుకు కేంద్రం రాష్ట్రానికి కృషి కర్మాన్ అవార్డు ఇచ్చింది.
- 25.54 లక్షల మందికి రూ.1,507 కోట్ల సబ్సిడీని ఆన్లై న్లో పంపిణీ చేశాం.
- 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 207.29 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా.
- దేశంలోనే కోడి గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.
- పావలా వడ్డీ రుణాన్ని వడ్డీలేని రుణాలుగా మార్చాం. ఈ రెండింటి కింద ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.2,659 కోట్లు పంపిణీ చేశాం.
- వందశాతం వైకల్యం ఉంటే పింఛన్ రూ.500 నుంచి రూ.1000కి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.
- అమ్మహస్తం కింద రూ.185కు నిత్యవసర వస్తువులు ఇస్తున్నాం.
- జలయజ్ఞంలో 17 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కొత్తగా 19.40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడింది.
- త్వరగా పూర్తయ్యే పథకాలకు ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయిస్తున్నాం.
- 18 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 40 రకాల సేవలను ఏకగవాక్ష వ్యవస్థలోకి తె చ్చినందుకు రాష్ట్రానికి ఇ-బిజ్ అవార్డు లభించింది.
- కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 2013-14లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- దుగ్గరాజపట్నంలో భారీ నౌకాశ్రయం, మచిలీపట్నంలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం కింద మరో నౌకాశ్రయం, భావనపాడు, కళింగపట్నంలో చిన్న నౌకాశ్రయాలు ఏర్పాటు చేస్తాం.
- చిత్తూరు జిల్లాలో మొదటి దశలో రూ.5,990 కోట్లు, రెండో దశలో రూ.1,400 కోట్లతో మంచినీటి పథకం చేపడుతున్నాం.
- రాష్ట్రం నుంచి రూ.51,285 కోట్ల ఐటీ ఎగుమతుల టర్నోవర్ సాధించాం. ఐటీఐఆర్, గే మ్పార్క్ ఏర్పాటు చేస్తున్నాం.
- 2014 సంవత్సరంలో రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు 2,370 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభిస్తాయి.
- పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్‌గాంధీ పంచాయతీ సశక్తికరణ్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.203 కోట్లు కేటాయించింది.
- ఉద్యోగులకు ఆరోగ్య పథకం ప్రారంభించాం.
- రూ.22,377 కోట్లతో ఇప్పటివరకు 66.11 లక్షల గృహాలు నిర్మించాం. కొత్తగా భాషా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం.
- ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రహ దారులను పీపీపీ కింద నాలుగు లేన్ల రోడ్లుగా మార్చాలని నిర్ణయించాం.
- మహిళలకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం. కొత్తగా 98,652 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
- 2012-13 సంవత్సరంలో తుది లెక్కలు ఆధారంగా రూ.1,128 కోట్ల రెవెన్యూ మిగులు తేలింది. 2013-14లో ఇది రూ.1,023 కోట్లుగా, 2014-15లో ఇది 474 కోట్లుగా ఉంటుందని అంచనా.
మమ అనిపించారు..
అసెంబ్లీలో బడ్జెట్ తంతు మొక్కుబడిగా ముగిసింది. తెలంగాణ మంత్రులు, అధికార, విపక్ష సభ్యుల నిరసనలతో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిగా చదవలేక కేవలం పది నిమిషాల్లోనే మమ అనిపించారు. మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో.. టీ బిల్లు తిరస్కరించే తీర్మానాన్ని ఆమోదించే విషయుంలో సీఎం, స్పీకర్ ఒక ప్రాంతానికి అనుగుణంగా వ్యవహరించారని, అలాగే ఢిల్లీలో వుహిళా వుంత్రులను అవవూనించారని ఆరోపిస్తూ తెలంగాణకు చెందిన మంత్రులు నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన మంత్రిమండలి ప్రత్యేక సమావేశానికి సైతం తెలంగాణ మంత్రులు హాజరు కాలేదు. సభలో టీఆర్ఎస్, టీ కాంగ్రెస్, టీ టీడీపీ సభ్యులు పెద్దపెట్టున తెలంగాణ నినాదాలు చేశారు.
సభ సజావుగా లేనందున ప్రసంగాన్ని చదివినట్లుగానే భావించాలంటూ ప్రసంగ పాఠంలోని ముందు నాలుగు పేజీలు, చివర్లో బడ్జెట్ పరిమాణాన్ని వివరించి 13వ శాసనసభ చివరి బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. పెద్దల సభ ఇంతకంటే మరీ అధ్వానంగా సాగింది. సభా నాయకుడు రామచంద్రయ్య బడ్జెట్ ప్రసంగం ప్రారంభించక ముందే తెలంగాణ ప్రాంత సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. ఏం జరుగుతుందో తెలియని గందరగోళం మధ్యే.. చైర్మన్ ఆదేశాల మేరకు మంత్రి ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ సభ్యులు సభా నాయకుడి మైక్‌కు అడ్డంగా చేతులు పెట్టి ప్రసంగించకుండా అడ్డుకున్నారు. దీంతో నిమిషానికే ప్రసంగం ముగించినట్లు పరిగణిస్తూ చైర్మన్ సభను వాయిదా వేశారు. మొత్తమ్మీద కొత్త పథకాలుగానీ, కొత్త కార్యక్రవూలుగానీ, ఉన్న పథకాలకు అధిక కేటారుుంపులుగానీ కనిపించకుండా.. కేవలం ఈ తంతు ముగిస్తే చాలన్న రీతిలో సభా వ్యవహారాలు కొనసాగాయి.