సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు గత ఏడాది కేటాయించిన స్థాయిలోనే ప్రస్తుత బడ్జెట్‌లో కూడా నిధులను కేటాయించారు. ఆయా ప్రాజెక్టులకు 2013-14లో కేటాయించిన నిధులకు సమానంగా తాజా బడ్జెట్‌లో కూడా చూపించారు. ఈ విషయంలో ప్రాజెక్టుల నిర్మాణ దశలను పట్టించుకోలేదు. ఏ ప్రాజెక్టుకు ఎంత మేర నిధులు అవసరమనే విషయాన్ని అంచనా వేయలేదు. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పోయిన ఏడాది మాదిరిగానే అంచనా వేసి బడ్జెట్‌లో పొందుపరిచారు.
కాగా, నిర్మాణ పనుల్ని పక్కన పెట్టిన దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు రూ. 97 కోట్లను కేటాయించడం విశేషం. అలాగే కేంద్రం నుంచి ఏఐబీపీ కింద రూ. 1394.27 కోట్లు రానున్నాయని అంచనా వేశారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎక్కువ నిధులను కేటాయించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ. 1,051 కోట్లను కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ. 87.50 కోట్ల వస్తాయని, రాష్ట్రం నుంచి రూ. 370.50 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించారు. పునరావాస పనులకోసం రూ. 185 కోట్లను కేటాయించారు.