ఎన్విరాన్మెంటల్ పోస్టుల్లో.. ‘బయోటెక్నాలజీ’కి అన్యాయం
ఇతర రాష్ట్రాల్లో అవకాశం.. ఇక్కడ మాత్రం నో
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టులకు కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన విద్యార్హతల్లో బయో టెక్నాలజీ విద్యార్థులను అన్యాయం జరిగింది. ఇటీవల టీఎస్పీఎస్సీ 26 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రకటించిన నోటిఫికేషన్లో బీటెక్ బయో టెక్నాలజీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో వారంతా ఆందోళనలో పడుతున్నారు. తమకు అవకాశం కల్పించాలంటూ టీఎస్పీఎస్సీ, కాలుష్య నియంత్రణ మండలి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు లేక, అటు ప్రభుత్వ విభాగాల్లోనూ అవకాశం రాక ఆందోళనలో మునిగిపోతున్నారు.
పదిహేనేళ్ల కింద బీటెక్ బయో టెక్నాలజీకి బాగా డిమాండ్ ఉండేది. కానీ ఆ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు సరైన ఉద్యోగావకాశాలు మాత్రం లభించడం లేదు. ప్రైవేటు రంగంలో బయో టెక్నాలజీకి అవకాశాల్లేవు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అవకాశం ఇవ్వనపుడు ఆ కోర్సును నిర్వ హించడం ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా.. కాలుష్య నియంత్రణ మండలి కూడా పట్టించుకోకుండా అన్యాయం చేసిందని వాపోతున్నారు. ఢిల్లీ, రాజస్థాన్లోని కాలుష్య నియంత్రణ మండళ్లలో భర్తీ చేసిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు బీటెక్ బయో టెక్నాలజీ అభ్యర్థులు అర్హులుగా ప్రకటించాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం విభిన్నంగా వ్యవహరిస్తుండడంతో ఆ కోర్సు చేసిన 30 వేల మంది ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.