15న ఫ్రీడమ్ రైడ్
సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి: నగరం మరో ఆసక్తికరమైన ఈవెంట్‌కు వేదిక కానుంది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ది అట్లాంటా ఫౌండేషన్’ నిర్వహించనున్న సైక్లింగ్ ఈవెం ట్లో 6వేల మంది కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొననున్నారు. తాజ్‌కృష్ణా హోటల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అట్లాంటా ఫౌండేషన్ వ్యవస్థాపకులు దీనానాథ్ మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 15న దేశ 66వ స్వాతంత్రదినోత్సవానికి సూచికగా 66 కి.మీ. ఫ్రీడమ్‌రైడ్‌ను నిర్వహిస్తున్నామని, ఇది జాతీయస్థాయిలో అతిపెద్ద కార్పొరేట్ సైక్లింగ్ ఈవెంట్ అని ఆయన పేర్కొన్నారు.
దీనిలో 50 బహుళజాతి సంస్థలకు చెందిన దాదాపు 6వేల మంది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొం టారని అంచనా వేస్తున్నామన్నారు. కనీసం 2 కి.మీ. తగ్గకుండా సైక్లింగ్ చేసే ప్రతి ఒక్కరికీ అవకాశం ఉండేలా పలు రైడ్స్‌ను ఇందులో భాగం చేశామన్నారు. ప్రొఫెషనల్స్ కోసం పతకాలు, నగదు బహుమతులను అందించనున్నామన్నారు. మహిళల సైక్లింగ్ టీమ్ ప్రత్యేక ఆకర్షణ కాగా క్యాపిటల్ గేమ్ వంటివి ప్రతి ఒక్కరూ పాల్గొని సైకిల్ లేదా ఇతర బహుమతులు గెలుచుకునేందుకు వీలుగా డిజైన్ చేశామన్నారు.
ఇది పూర్తిస్థాయి సైక్లింగ్ కార్నివాల్‌గా ఆయన అభివర్ణించారు. రైడర్స్ కిట్‌తో సహా ఇందులో పాల్గొనేవారు రూ.1250 చొప్పున చెల్లించాలని తెలిపారు. లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా తాము విరాళాలు స్వీకరించబోమని, గత ఐదేళ్లుగా ఈవెంట్ల నిర్వహణ ద్వారా సేకరించిన నిధులను నిరుపేద విద్యార్థుల విద్యార్జనకు వినియోగిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగినవారు www.atlantafoundation.org లేదా info@atlantafoundation.orgకు మెయిల్ చేయడం లేదంటే ఫేస్బుక్ ద్వారా గాని పాల్గొనవచ్చునన్నారు.
త్వరలో గాంధీజయంతి సందర్భంగా నగరంలోని బాపూఘాట్ నుంచి గుజరాత్‌లోని సబర్మతి వరకూ 1200 కి.మీ. లాంగ్ సైక్లింగ్‌రైడ్‌ను నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్ మాట్లాడుతూ నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు పలు రకాల చర్యలు చేపట్టనున్నామన్నారు. భారత్ బయోటెక్ కో ఫౌండర్ సుచిత్రాఎల్లా, రాష్ట్ర సైక్లింగ్ క్రీడాకారుడు రమణ్ గరిమెల్ల, బ్యాంక్ ఆఫ్ అమెరికా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రమేష్ కాజలు మాట్లాడారు.