అదిగో.. ఏటీఎం నిందితుడు!
రాయదుర్గం, న్యూస్‌లైన్: బెంగళూరులోని ఏటీఎం సెంటర్లో కార్పొరేషన్ బ్యాంక్ మహిళా మేనేజర్‌పై దాడి చేసి.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు కనిపించాడంటూ బుధవారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రచారం జరగడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.
వివరాలిలా... బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఓ వ్యక్తి డబ్బు డ్రా చేసుకోవడానికి స్థానిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వద్దనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రంలోకి వెళ్లాడు. అతను బెంగళూరు ఏటీఎం నిందితుడి పోలికలతో ఉండడంతో సెక్యూరిటీ గార్డు పూల చంద్ర శేఖర్ ‘పట్టుకోండి.. పట్టుకోండి..’ అంటూ కేకలు వేశాడు. ఆలోగా ఆ వ్యక్తి బయటకు వచ్చి తన ద్విచక్ర వాహనంలో బస్టాండ్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో ముమ్మురంగా గాలించారు. కాగా ఉదయం ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన వ్యక్తి సాయంత్రం అదే మార్గంలో వెళుతుండగా సెక్యూరిటీ గార్డు అతన్ని గమనించి పోలీసులకు చూపించాడు. వారు అతన్ని ఆపి విచారించారు. అతను మండలంలోని చదం గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి అని, అతను నిందితుడు కాదని తేల్చారు. నిందితుడి పోలికలు ఉండడంతో సెక్యూరిటీ గార్డు పొరబడ్డాడని నిర్ధారించారు.