ఏటీఎం నెంబర్ అడిగి..
డబ్బు డ్రా సైబర్ నేరగాళ్లు
నర్సాపూర్: ఏటీఎం కార్డు నంబరు చెప్పాలని, లేకపోతే కార్డ్ బ్లాక్ అయిపోతుందని హెచ్చరించడంతో ఆ అమాయకుడు తన కార్డు నంబరు చెప్పాడు. దీంతో అదే రోజు అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ. 13 వేలు డ్రా చేసుకున్న సైబర్‌నేరగాళ్ల ఉదంతమిది. శివ్వంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధి సీతారాం తండాకు చెందిన లంబాడి రవికి ఎస్బీఐ బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డు ఉంది.
కాగా ఈనెల 3న గుర్తు తెలియని వ్యక్తి తన మోబైల్‌కు ఫోన్ చేసి నీ ఏటీఎం కార్డు నంబరు చెప్పాలని, లేకపోతే కార్డు బ్లాక్ అవుతుందని హెచ్చరించడంతో తాను భయపడి నంబరు చెప్పానన్నాడు. అనంతరం పిన్ నంబరు సైతం చెప్పాలని ఆగంతకుడు అడిగాడు. అయితే పిన్ నంబరు ఎందుకని ఎదురు ప్రశ్నించడంతో అతడు ఫోన్ కట్ చేశాడని చెప్పాడు. కాగా శనివారం ఏటీఎంకు వెళ్లి తన ఖాతాలో చూడగా ఈనెల 3నాడే రూ. 13వేలు డ్రా అయినట్లు ఉందని రవి వాపోయాడు.
తన ఖాతా నుంచి డబ్బులు డ్రా అయిన విషయాన్ని ఎస్బీఐ అధికారులకు తెలియచేయగా పరిశీలిస్తామని చెప్పారని ఆయన చెప్పాడు. తన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తులను గుర్తించి తనకు న్యాయం చేయాలని అతడు కోరాడు. కాగా నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని రవినాయక్ చెప్పాడు. కాగా ఈ విషయమై స్థానిక ఎస్ఐ వెంకటరాజగౌడ్ను అడగ్గా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.