పట్టుకోండి.. చూద్దాం!
ఆత్మకూరులో వరుస చోరీలు
రెండు రోజుల్లో మూడు ఘటనలు
పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు
పాత నేరస్తుల కదలికలపై దృష్టి
వణికిపోతున్న స్థానికులు
ఆత్మకూరు: వరుస చోరీలతో పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. శుక్రవారం ఏటీఎంలో చోరీ యత్నం.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి చొరబడిన దుండగులు గందరగోళం సృష్టించడం తెలిసిందే. తాజాగా శనివారం తెల్లవారుజామున తోటగేరిలోని ఓ గుడిసెలో చోటు చేసుకున్న చోరీ పోలీసులకు సవాల్‌గా మారింది. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న శంకర్ ఇంట్లో నిద్రిస్తుండగా.. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆగంతకుడు గుడిసెకున్న తడికె వాకిలి తెరుచుకుని లోనికి ప్రవేశించాడు. బీరువాలోని 4 జతల బంగారు కమ్మలు, పట్టీలు, ఒక ఉంగరం, రూ.15వేల నగదుతో పాటు చీరలతో బయటికి వెళ్తుండగా అలికిడికి మేలుకున్న శంకర్ అతడిని వెంబడించాడు. ఆగంతకుడు వెంట తెచ్చుకున్న పాత సామాన్ల మూటను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు పట్టణంతో పాటు సిద్ధాపురంలోని పాత నేరస్తులను పిలిపించి విచారణ కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చోరీలు జరిగినా గతంలో పోలీసులకు మొదట గుర్తుకొచ్చే పేరు సిద్ధాపురం. చోరీలకు ఇక్కడి నివాసితులు పెట్టింది పేరు. కాలక్రమంలో వీరిలోనూ మార్పు రావడంతో చాలా మంది స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నారు.
అయితే కొంతమంది చోరీలనే ప్రవృత్తిగా ఎంచుకోవడంతో తక్కిన వారినీ అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆత్మకూరులో చోటు చేసుకున్న చోరీలతో పాటు నాటు తుపాకులు, పులి చర్మాల విక్రయం తదితర ఘటనల్లో పోలీసులు, ఫారెస్టు అధికారులు సిద్ధాపురం గ్రామస్తులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. తాజాగా పట్టణంలో వరుస చోరీలు చోటు చేసుకోవడంతో సిద్ధాపురంలోని పాత నేరస్తులను కూడా విచారణ పేరిట స్టేషన్‌కు రప్పించారు. ఈ చోరీల వెనుక వీరి హస్తమే ఉందా.. లేక భిట్రకుంట, స్టూవర్టుపురం, నెల్లూరు ప్రాంతాల దొంగల ప్రేమయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే సంవత్సరం రోజుల్లో 42 చోరీ కేసులు నమోదు కాగా.. ఏడు కేసుల్లో మాత్రమే రికవరీ చూపడం గమనార్హం. వరుస ఘటనలపై సీఐ శ్రీనివాసులు స్పందిస్తూ.. పాత నేరస్తులను విచారిస్తున్నట్లు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. రాత్రిళ్లు బీట్లు కూడా పెంచుతున్నట్లు తెలిపారు.