చంద్రబాబూ.. ఇప్పుడే ఎందుకు ఢిల్లీ యాత్ర?: అంబటి రాంబాబు
వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్న
కాంగ్రెస్‌వారి కాళ్లు పట్టుకొని జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకేనా?
ఆత్మగౌరవ యాత్రను ఎందుకు అర్ధంతరంగా ముగించారు?
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధంతరంగా తన ఆత్మగౌరవ యాత్ర ముగించుకుని ఎందుకు ఢిల్లీ వెళుతున్నారో, ఏ వాదం వినిపించడానికి బయలుదేరుతున్నారో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాదయాత్ర చేసినా, బస్సు యాత్ర చేసినా, ఢిల్లీ యాత్ర చేసినా జగన్, వైఎస్సార్‌పై దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు చేస్తున్నందునే.. ఇప్పుడు జగన్ బెయిల్ అడ్డుకుంటారనే అపోహలు, అనుమానాలు అందరిలో నెలకొన్నాయని అన్నారు. సీబీఐ దర్యాప్తు పూర్తవుతున్న నేపథ్యంలో జగన్ బెయిల్‌కు అవకాశాలు మెరుగయ్యాయని మేధావులు, సామాన్యులకు అర్థమవుతున్న ఈ తరుణంలో చంద్రబాబు ఢిల్లీ యాత్రపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
శుక్రవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. ‘‘జగన్‌కు బెయిల్ రాకుండా, నిర్బంధంలో ఉంచాలనే తాపత్రయం చంద్రబాబులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతిందని ఈనెల 1 నుంచి బాబు బస్సు యాత్ర చేశారు. ఇప్పుడు అర్ధంతరంగా బస్సు యాత్ర ఎందుకు ఆపారు? సమైక్యవాదం బలంగా ఉందని చెప్పేందుకు ఢిల్లీకి వెళ్తున్నారా? రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నానని చెప్పేందుకు వెళ్తున్నారా? లేక జగన్మోహన్ రెడ్డి బెయిల్ అడ్డుకునేందుకు కాంగ్రెస్ వారి కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ యాత్ర చేస్తున్నారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
సమైక్య వాదమా.. ప్రత్యేక వాదమా.. అవకాశవాదమా?
‘‘చంద్రబాబుది సమైక్య వాదమా? ప్రత్యేక వాదమా? అవకాశ వాదమా? ఏదో చెప్పాలి. ఏ వాదం వినిపించడానికి ఆత్మగౌరవ యాత్ర చేశారో.. ఏ వాదనల్ని వినిపించడానికి ఢిల్లీ వెళుతున్నారో.. దయచేసి సమాధానమివ్వాలి. పారదర్శకంగా ఉంటానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడైనా నోరు విప్పాలి. జై తెలంగాణ అనే వారిని, జై సమైక్యాంధ్ర అనే వారిని, ఇరు ప్రాంతాల వారిని వెంటబెట్టుకుని ఢిల్లీ వెళతారట. ఇంతకంటే పచ్చి అవకాశంవాదం ఏమైనా ఉంటుందా?’’ అని అంబటి ప్రశ్నించారు. బీజేపీతో కలవడం చారిత్రాత్మక తప్పిదం అన్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, గతంలో మోడీ గద్దె దిగాలని దూషించి, ఇప్పుడు మోడీ ప్రధాని అభ్యర్థి అని బీజేపీ ప్రకటిస్తుందని తెలిసి ఆ పార్టీతో పొత్తు కోసం అర్రులు చాచడం బాబుకు అనైతికతకు నిదర్శనమని మండిపడ్డారు.
జగన్‌కు కాంగ్రెస్‌తో రాజీ పడాల్సిన అవసరమేంటి?
‘‘ఈ నెల 9లోపు అన్ని చార్జిషీట్లు వేసేందుకు సుప్రీంకోర్టు.. సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో తొమ్మిదో తేదీ నుంచే ఎల్లో మీడియా కథనాలు రాస్తోంది. కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కై పోయార ని.. రాజీ పడటం వల్లే బెయిలొస్తుందని నిస్సిగ్గుగా రాస్తున్నారు. 15 నెలలుగా జైల్లో ఉన్న జగన్ కాంగ్రెస్‌తో రాజీ పడాల్సిన అవసరం ఏముంది?’’ అని అంబటి ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో సహజంగానే బెయిల్ వచ్చే అవకాశాలు మెరుగుపడతాయే తప్ప ఎవరితోనో కుమ్మక్కైతే బెయిల్ వచ్చే పరిస్థితులు ఉండవన్న సంగతిని తెలుసుకోవాలని సూచించారు. వైఎస్ తనని చూసి బెదిరిపోయేవారని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, అయితే వైఎస్ బతికున్నప్పుడు బాబు ఈ గొప్పలు చెబితే బాగుండేదని అన్నారు.
జగన్ బయటకొస్తే నీ పార్టీ పుట్టగతుల్లేకుండా పోతుందన్న భయమా?
‘‘చంద్రబాబూ.. ఢిల్లీలో ఉన్న పెద్దపెద్ద పత్రికాధిపతులతో రహస్యంగా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డిపై ఇంగ్లిష్ పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు రాయించి సుప్రీంకోర్టును ప్రభావితం చేయాలని ఒక విష ప్రయత్నం చేస్తున్నావు. జగన్ బయటకొస్తే నీ పార్టీ పుట్టగతుల్లేకుండా పోతుందని నీకు స్పష్టంగా అర్థమైందనే విషయం అందరికీ అర్థమైంది’’ అని అంబటి అన్నారు. 15 నెలలుగా జగన్ జైల్లో ఉన్నా, విజయమ్మ, షర్మిలమ్మ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరకుండా ముందుకు వెళుతోందన్నారు. ఇక జగన్ బయటకొస్తే టీడీపీ పరిస్థితి ఏమిటనే భయం చంద్రబాబును వెన్నాడుతోందని చెప్పారు.