భారత్‌లో ఏటా లక్షకుపైగా మరణిస్తారట!
లండన్: పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్న విషయం తెల్సిందే. ఈ మార్పుల కారణంగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు భారత్‌లాంటి వర్ధమాన దేశాల్లో వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా 2050 సంవత్సరం నాటికి భారత్‌లో ఏటా 1,60,000 మంది మరణిస్తారని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఈ యూనివర్శిటీ పరిశోధకులు 155 దేశాలపై అధ్యయనం జరపగా క్లైమేట్ ఛేంజ్ కారణంగా మరణాలు సంభవించే దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఏడాదికి 2,48,000 మంది మరణాలతో చైనా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. భారత్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్, వియత్నాం, అమెరికా దేశాలు ఉన్నాయి. వ్యయసాయోత్పల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వల్ల ధరలు పెరిగిపోవడం, సరకులు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, మాంసం వినియోగం గణనీయంగా పడిపోవడం, పర్యవసానంగా తలెత్తే పౌష్టికాహార లోపం, బరువు తగ్గి పోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని మరణాలను అంచనావేసినట్లు పరిశోధకులు తెలిపారు.
గుండె, క్యాన్సర్ లాంటి జబ్బులోకాకుండా మలేరియా, డెంగ్యూ వ్యాధులు, అంటురోగాల వల్ల మరణాలు సంభవిస్తాయని నేచర్ పత్రిక లాన్సర్‌లో ప్రచురించిన వ్యాసంలో ఆక్స్ఫర్డ్ పరిశోధకులు వివరించారు. 2050 నాటికి అహారోత్పత్తుల అందుబాటు 3.2 శాతం, పండ్లు, కూరగాయలు 4 శాతం, మాంసం ఉత్పత్తులు 0.7 శాతం తగ్గిపోతాయని పరిశోధకులు అంచనా వేశారు.
వాతావరణ మార్పుల కారణంగా సంభవించే మరణాలను అరికట్టేందుకు భారత్ లాంటి దేశాల్లో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి కూడా పరిశోధకులు కొన్ని సూచనులు చేశారు. పలు రకాలుగా వ్యవసాయోత్పత్తుల సాగును ప్రోత్సహించాలని, బియ్యం, గోధుమ పంటలపైనే దృష్టిని కేంద్రీకరించకుండా పండ్లు, కూరగాయల సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని వారు సూచించారు. ఆరోగ్య స్కీమ్‌లను పటిష్టం చేసి ప్రజలకు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని, ముఖ్యంగా ఎప్పటికప్పుడు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని కనుగొనేందుకు వారి బరువును తూచే అంగన్వాడి వ్యవస్థను విస్తరించాలని సిఫార్సు చేశారు.