
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో శుక్రవారం అరుదైన వాతావరణం నెలకొంది. వేకువ జాము నుంచే వర్షం మొదలైంది. తెల్లారేసరికి దానికి పొగమంచు కూడా తోడైంది. ఇలా ఉదయం ఆరంభమైన వాన 10 గంటల వరకు కురిసి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. కానీ పొగమంచు మాత్రం మధ్యాహ్నం దాటే దాకా కొనసాగింది. దీంతో విశాఖ నగరమంతా మంచు ముసుగు తొడుక్కుని మసకబారినట్టుగా మారిపోయింది.
మంచు వర్షం కురిసినట్టు అగుపించింది. దీంతో కాస్త దూరంగా ఉన్న వాహనాలు, వాటి కదలికలు స్పష్టత లేకుండా పోయాయి. వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. విశాఖ నగరంతో పాటు ఉమ్మడి విశాఖలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో ఇలాంటి వాతావరణ పరిస్థితి కనిపించలేదు. సాధారణంగా ఈ సీజనులో తరచూ మన్యం ప్రాంతంలోనే చిరుజల్లులు, పొగమంచు ఏర్పడుతుంటుంది. కానీ అందుకు భిన్నంగా విశాఖలో మన్యాన్ని తలపించే వాతావరణం అందరిలోనూ ఒకింత ఆశ్చర్యానికి, ఆసక్తికి గురిచేసింది.
ఇదీ కారణం..!
గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, పొడి గాలులు లేకపోవడం వల్ల పొగమంచు ఏర్పడడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి శనివారం కూడా కొనసాగే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి ‘సాక్షి’కి చెప్పారు. రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తూ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment