స్నో పార్క్ నమూనా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంచు కురిసే వేళలో... మల్లె విరిసేదెందుకో అని హమ్ చేస్తూ మంచులో ఆటలాడాలనుకుంటున్నారా? ఏదైనా మంచు పర్వతాన్ని ఎక్కాలనుకుంటున్నారా? అయితే, మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన విశాఖలోనే మంచులో పాటలతో పాటు ఆటలూ ఆడుకునేందుకు సిద్ధం కండి. నగరంలో స్నో పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ (జీవీఎస్‌సీసీఎల్) ఆధ్వర్యంలో రెండు ఎకరాల్లో రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు.
ఇందుకోసం అనువైన స్థలం కోసం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ స్నో పార్కులో మంచులో బాస్కెట్‌బాల్ ఆడేందుకూ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా మంచు హోటల్‌ను కూడా ఈ పార్కులో నిర్మించనున్నారు. మంచు పర్వతారోహణ ఏర్పాట్లు చేయడం ద్వారా.. ఇక్కడకు వచ్చేవారు పూర్తిస్థాయిలో మంచును ఎంజాయ్ చేసే విధంగా దీనిని రూపుదిద్దాలనేది యోచన. ఈ పార్కు ఏర్పాటు కోసం అనువైన స్థలం లభించిన వెంటనే పనులు మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ పార్కు ఏర్పాటు కోసం పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారుచేసే పనిలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు పడ్డారు.
మంచు పర్వతారోహణ కూడా..
స్నో పార్కు అంటే కేవలం పూర్తిస్తాయిలో మంచు కప్పబడి ఉన్న ప్రదేశంగా కాకుండా అన్ని విధాలా ఆకర్షణీయంగా దీనిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. పైనుంచి సన్నటి మంచు పడటంతో పాటు అక్కడే ఒక హోటల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఒక బాస్కెట్ బాల్ గ్రౌండ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా చిన్నపాటి మంచు పర్వతాలను కూడా ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. మంచు పర్వతారోహణ (స్నో మౌంటెయిన్ క్లైంబింగ్) అనుభవాన్ని కూడా ఇక్కడకు వచ్చే వారికి లభించే విధంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా వివిధ టీవీ, ఫిల్మ్ షూటింగ్‌ల కోసం అనువైన ప్రదేశంగా కూడా దీనిని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ పార్కును బీచ్ రోడ్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ఇంకా స్థలాన్ని ఎంపిక చేయలేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి పార్క్ హోటల్ పక్కన ఉన్న వీఎంఆర్‌డీఏ స్థలంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బోర్డులో నిర్ణయించారు. మొత్తం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
బోర్డులో చర్చించాం
విశాఖలో స్నో పార్కును ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. రెండు ఎకరాల్లో రూ.20 కోట్ల మేర అంచనా వ్యయంతో ఏర్పాటు చేయాలనేది ఆలోచన. ఈ మేరకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బోర్డులో చర్చించాం. దీనిపై పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేయిస్తాం. ఈ పార్కు ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నాం.
– గన్నమనేని వెంకటేశ్వరరావు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్
పర్యాటకానికి అడ్డాగా...
దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మెగా వీల్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా స్నో పార్క్ ఏర్పాటుకు సై అంటోంది. ఇప్పటికే విశాఖలో పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారీ సంస్థలు అనేకం ఆసక్తి చూపుతున్నాయి. స్టార్ హోటల్స్, రిసార్టులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగావీల్, స్నో పార్కు వంటి ఆహ్లాదకర ప్రదేశాల ఏర్పాటుతో విశాఖను పర్యాటకరంగానికి అడ్డాగా రూపుదిద్దాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. ఇటువంటి స్నో పార్కు విశాఖలో ఏర్పాటుచేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment