అటాక్ హుస్నాబాద్ పేరుతో మరోసారి వస్తా...
కరీంనగర్ : అటాక్ హుస్నాబాద్ పేరుతో మరోసారి వస్తా... అప్పుడు ఒకే రోజు లక్ష మొక్కలు నాటుదామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతిగ్రామంలో 40 వేల మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాలని, ఒక్క మొక్క దక్కకపోయినా సర్పంచ్, ఎంపీటీసీ రాజీనామా చేయాల్సిందేనని కరీంనగర్ జిల్లా పర్యటనలో సీఎం స్పష్టం చేశారు. మొక్కల పెంపకానికి గ్రామానికి రూ. 10 లక్షలు ఆయన మంజూరు చేశారు.
గ్రామ సర్పంచ్ లు వాడవాడలా తిరిగి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేయొద్దని నినాదాలు చేసిన వారిని మందలించి, మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్ కు ఏడాదిలోగా నీరందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాళేశ్వరం పథకం ద్వారా కొమరవెల్లి మల్లన్న రిజర్వాయర్ ను నింపుతామని చెప్పారు. హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాలలో ప్రతి గ్రామానికి నీరందిస్తామని ఆయన వివరించారు.