attack on people
-
అన్నదమ్ములపై మద్యం వ్యాపారి దాడి
రాయగడ : మద్యం తాగేందుకు వచ్చిన ఓ ఇద్దరి అన్నదమ్ములపై మద్యం వ్యాపారి తన అనుయాయులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన జిల్లాలోని తేరువలి ప్రాంతం పరిధిలో ఉన్న డీపీ క్యాంప్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి... రాయగడ జిల్లాలోని తేరువలి గ్రామ పంచాయతీ గునాకల్ గ్రామానికి చెందిన మున్నా కడ్రక(25), సున్నా కడ్రక(22) అతని స్నేహితుడు సున్నా తాడింగి విదేశీ మద్యం తాగేందుకు తేరువలి ప్రాంతంలోని డీపీ క్యాంప్ వద్ద ఉన్న కమనామహానందియా సారాబట్టీకు వెళ్లారు. మద్యం తాగి వీరు కేవలం రూ.500 మాత్రమే చెల్లించి మిగతా సొమ్మును ఏటీఎం నుంచి తీసి, తీసుకువస్తామని చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం తేరువలి బ్రిడ్జిపై నుంచి ఏటీఎంకు వెళ్తున్న బాధితులపై వ్యాపారి తన అనుయాయులైన సుమారు 20 మందితో కలిసి దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు అన్నదమ్ములకు తీవ్రగాయాలవ్వగా, స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వైద్య సేవల నిమిత్తం క్షతగాత్రులను రాయగడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
చేతబడి పేరుతో..హింజిలిలో.. హింస..!
బరంపురం : చేతబడి చేస్తున్నారన్న నెపంతో ఓ కుటుంబంపై గ్రామస్తులంతా మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన గంజాం జిల్లాలోని హింజిలికాట్ నియోజకవర్గంలో శుక్రవారం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన సుమారు ఐదుగురిపై గ్రామస్తులంతా దాడికి దిగడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకిత్తిస్తోంది. సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోనే ఇలాంటి సంఘటన జరగడం పట్ల పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఐఐసీ అధికారి ప్రశాంత్‌కుమార్ సాహు దుర్బాదా, సూలాయి గ్రామం మధ్య ఉన్న ఒక గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సుమారు 50 మంది వారిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ ఘటనలో బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయంపై స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దీనికోసం అదనపు పోలీసు బెటాలియన్లను తరలించి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు ఐఐసీ అధికారి ప్రశాంత్‌కుమార్ సాహు తెలిపారు. -
ఏనుగుల బీభత్సం, 8 మందికి గాయాలు
వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటివరకు గజరాజులు అక్కడి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అయితే, అల్లికుప్పం వద్ద పంటపొలాల్లో విద్యుదాఘాతానికి గురై ఓ ఏనుగు మృతిచెందడంతో పాటు మరో ఏనుగుకు గాయమైంది. దీంతో ఆ స్థలానికి మరికొన్ని గజరాజులు వచ్చి ఘీంకారాలు పెడుతున్నాయి. ఏనుగులు అల్లికుప్పం గ్రామస్తులపై దాడులకు దిగాయి. భయాందోళనలకు గురైన స్థానికులు పరుగులు ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. గజరాజుల దాడిలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.