అమెరికాలో హిందూ ఆలయంపై జాత్యహంకార దుశ్చర్య
వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకారం మరోసారి పడగ విప్పింది. హిందువులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా వేడుకలకు సిద్ధమైన ఒక హిందూ దేవాలయం గోడపై ఆగంతుకులు స్వస్తిక్ గుర్తును స్ప్రే చేసి, ‘గెట్ అవుట్ (ఇక్కడి నుంచి వెళ్లిపోండి)’ అని రాశారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. అమెరికా ఈశాన్య ప్రాంతంలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే కావడం గమనార్హం. కాగా.. ‘‘అమెరికాలో ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదు. వెళ్లిపొమ్మనడానికి మీరెవరు? ఇది వలస వచ్చిన వారి దేశం..’’ అని ఈ దేవాలయం ట్రస్టీల బోర్డు చైర్మన్ నిత్యా నిరంజన్ పేర్కొన్నారు. ఈ ఘటనను అమెరికాలోని భారత సంతతి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మహా శివరాత్రి పర్వదినం సమయం చూసుకుని, దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని... వారిని గుర్తించి శిక్షించే వరకూ వదలబోమని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ప్రతినిధి జే కన్సారా అన్నారు. మరోవైపు ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.