అమెరికాపై దాడులకు అల్‌ఖైదా కుట్ర
అగ్రరాజ్యం అమెరికా మీద మరోసారి దాడి చేసేందుకు అల్ ఖైదా సిద్ధమవుతోందా? దానికి అనుబంధంగా ఉన్న సిరియన్ ఉగ్రవాద సంస్థ అల్ నస్రా ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందా? అవుననే అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు. అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే శిక్షణ మొదలు పెట్టేశాయని డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ జేమ్స్ క్లాపర్ తెలిపారు. అమెరికా భద్రతకు ఇది చాలా పెద్ద సవాలని ఆయన సెనేట్ కమిటీకి చెప్పారు. అమెరికాపై ఎలాగైనా దాడులు చేయాలన్న గట్టి ఉద్దేశంతో, నమ్మకంతో అల్ నస్రా సంస్థ ఉందని ఆయన అన్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను క్లాపర్ బయటపెట్టలేదు. అలాగే, అల్ నస్రా సంస్థ ఏ రూపంలో దాడులు చేస్తుందో కూడా ఇంకా చెప్పలేదు. ఇది ఇటీవలి కాలంలోనే ఏర్పడిన ఉగ్రవాద సంస్థ అని, అయితే శరవేగంగా విస్తరిస్తూ పోతోందని, పలు ప్రాంతాల్లో దీని ఉనికి ఉందని క్లాపర్ వివరించారు. యెమెన్‌కు చెందిన అల్‌ఖైదా లాంటి సంస్థలు అరేబియన్ ప్రాంతంలో ఇంకా చాలా ఉన్నాయని, ఇవన్నీ కూడా అమెరికా మీద దాడులు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని చెప్పారు.
ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. సిరియాలో దాదాపు 75 వేల నుంచి 1,10,000 మంది తిరుగుబాటుదారులు బషర్ అసద్ సర్కారుతో పోరాడుతున్నారు. వారిలో దాదాపు 26,000 మంది ఉగ్రవాదులని, అందులో 50 దేశాల నుంచి వచ్చిన 7,000 మంది విదేశీయులు కూడా ఉన్నారని క్లాపర్ చెప్పారు. వీరు కేవలం భౌతిక దాడులు మాత్రమే చేయడం లేదని, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పొందడం వల్ల అమెరికా రక్షణ వ్యవస్థలకు పెద్ద ముప్పే పొంచి ఉందని కమిటీ చైర్పర్సన్ డయాన్ ఫీన్‌స్టీన్ హెచ్చరించారు. అమెరికా, ఇతర దేశాల మీద దాడి చేయడానికి సిరియా ఒక స్థావరంగా ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.