Attar chand Basha
-
సత్యసాయి జిల్లా కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్
-
Sri Sathyasai District: కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్.. ప్రాణాపాయస్థితిలో..
కదిరి టౌన్: నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి చాంద్ వర్గీయుడు శ్రీనివాసులు నాయుడిపై కందికుంట వర్గీయులు దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. శ్రీనివాసులు నాయుడు ఈసారి తమ నేత చాంద్‌బాషాకే టికెట్ వస్తుందని సోషల్ మీడియాలో శుక్రవారం సాయంత్రం పోస్టు చేశాడు. దీన్ని కందికుంట వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. అతనిపై దాడి చేయాలని నిర్ణయించుకుని ఇంటి వద్దకు వెళ్లారు. దాడిలో గాయపడిన శ్రీనివాసులు నాయుడు అక్కడ లేకపోవడంతో పట్టణంలో గాలిస్తుండగా.. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని చాంద్ లాడ్జీ వద్ద ఆటోలో తారసపడ్డాడు. దీంతో అతనిపై కందికుంట వర్గీయులైన టీడీపీ పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, సయ్యద్, ఇమ్రాన్, సోను ఫయాజ్, బాబు, మారుతి, రామాంజనేయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చాంద్ వర్గీయులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్ సీఐ రియాజ్ అహమ్మద్ తెలిపారు. చదవండి: (అక్రమాలు.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ ఇండస్ట్రీపై కేసు..) -
రెబల్.. గుబుల్
సాక్షి, అనంతపురం : టీడీపీ అభ్యర్థులకు రెబల్స్ గుబులు పట్టుకుంది. టీడీపీ తరఫున టిక్కెట్ ఆశించి భంగపడిన ఆశావహులు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నారు. టీడీపీ ఓటమే తమ లక్ష్యమని ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలతో బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులంతా ఆందోళనతో చెందుతున్నారు. కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే ‘ఉన్నం’ ఇప్పటికే ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయగా.. గురువారం ‘దుర్గం’లో కాలవకు పోటీగా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి నామినేషన్ వేశారు. పైగా కాలవను ఓడించడమే ధ్యేయమని ఇప్పటికే ఆయన ప్రకటించారు. దీంతో మంత్రి కాలవ వెన్నులో వణుకుపుడుతోంది. రాయదుర్గం నుంచి బరిలో ఉన్న మంత్రి కాలవ శ్రీనివాసులుకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. గత ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి కాలవను గెలిపించిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ‘దుర్గం’లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ప్రచార సభ జనాలతో కిక్కిరిసింది. వేలాది మందితో దుర్గం హోరెత్తింది. ఈ జనస్పందన చూస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి, మెట్టు కలయికతో పార్టీ మరింత బలోపేతమైందని స్పష్టమవుతోంది. ఈ సభ విజయవంతంతోనే కాలవ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతలోనే దీపక్‌రెడ్డి గురువారం ఓ సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే కాలవ బరిలో ఉన్నారు. అయినప్పటికీ దీపక్‌రెడ్డి నామినేషన్ వేయడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రెండేళ్లుగా కాలవను దీపక్‌రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాలవకు టిక్కెట్ రాకుండా తాను బరిలో ఉండాలని యత్నించారు. టీడీపీ అధిష్టానం కాలవకు టిక్కెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తానని చెప్పారు. అయితే అధిష్టానం సర్దుబాటు చేస్తుందని అంతా భావించారు. అయినప్పటికీ దీపక్ మాత్రం నామినేషన్ వేశారు. ముహూర్తం బాగుందని నామినేషన్ దాఖలు చేశామని, ఈ నెల 25న భారీర్యాలీ నిర్వహించి నామినేషన్ వేస్తామని ఆయన తెలిపారు. ‘దుర్గం’ టీడీపీలో ‘మెట్టు’, దీపక్‌రెడ్డికి బలమైన కేడర్ ఉంది. మెట్టు వెళ్లడంతో ఓ వర్గం టీడీపీకి దూరమైంది. మరో వర్గం దీపక్‌రెడ్డి వెంట నడవనుంది. దీంతో కాలవ పూర్తిగా బలహీనపడినట్లయింది. సర్వేల్లోనూ కాలవకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో దీపక్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం చూస్తే అక్కడ ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో స్పష్టమవుతోంది. కళ్యాణదుర్గంలో ‘ఉన్నం’ ప్రచారం షురూ కళ్యాణదుర్గంలో నియోజకవర్గంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైఎస్సార్సీపీ తరఫున ఉషాశ్రీ చరణ్, కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, టీడీపీ తరఫున ఉమామహేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ వేసిన ‘ఉన్నం’ ఇండిపెండెంట్‌గా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ టీడీపీ కూడా రఘువీరాకు సహకరించేందుకు సిద్ధమైంది. అయితే కొన్నేళ్లుగా కాంగ్రెస్‌పై పోరాడి కష్టనష్టాలకోర్చిన టీడీపీ శ్రేణులు ‘చంద్రబాబు–రఘువీరా’ కుమ్మక్కు రాజకీయాలపై తీవ్రంగా రగిలిపోతున్నారు. వారి రాజకీయానికి తాము బలికావాలా? అంటూ రఘువీరాతో పాటు ఉమామహేశ్వర్‌కు కూడా సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. రఘువీరా, ఉమా, ఉన్నంలు టీడీపీ ఓట్లును చీల్చనున్నారు. ఇదే జరిగితే అక్కడ ఎలాంటి ఫలితం ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉషాశ్రీ చరణ్ వైఎస్సార్సీపీ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుప్తా కూడా రెబల్గానే బరిలోకి టీడీపీ తరఫున గుంతకల్లు టిక్కెట్ ఆశించి భంగపడిన మధుసూదన్ గుప్తా జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. జనసేన తరఫున పోటీలో ఉన్నా...ఇతన్ని కూడా టీడీపీ రెబల్గానే భావించాలి. ఏడాదిగా అతను టీడీపీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో పనిచేశారు. జితేంద్రగౌడ్‌కు కాకుండా గుప్తాకే టిక్కెట్ అని ఆపార్టీ శ్రేణులు భావించాయి. ఎంపీ జేసీ కూడా గుప్తానే అభ్యర్థి అని ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో గౌడ్ బలహీనంగా తయారయ్యారు. ఇప్పుడు గుప్తాకు కాకుండా తిరిగి గౌడ్‌కే టిక్కెట్ ఇచ్చారు. దీంతో గుప్తా పార్టీ వీడి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. టీడీపీలోని బలమైన వర్గం గుప్తాతో నడవనుంది. దీంతో టీడీపీ ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వెంకట్రామిరెడ్డికి టీడీపీలోని ఓట్ల చీలిక కలిసిరానుంది. ఇండిపెండెంట్‌గా బరిలోకి అత్తార్..! కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా ఇండిపెండెంట్‌గా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ నిమ్మల కిష్టప్ప, కందికుంట ప్రసాద్ చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదని అత్తార్‌తో అనుచరులు చెబుతున్నారు. కందికుంటకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి కందికుంటను ఓడించాలనే భావనలో అత్తార్ ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీ నేతగా ఉన్న అత్తార్ వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీ కండువా కప్పుకుని మైనార్టీ ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారు. దీంతో అత్తార్ వెంట మైనార్టీలు వచ్చే అవకాశం లేదు. ఈ విషయం అత్తార్‌కు తెలుసు. అయితే టీడీపీలో ఉన్న మైనార్టీయేతర వర్గాల ఓట్లనైనా తాను చీల్చగలనని, తద్వారా సిట్టింగ్ అయిన తనను కాదని టిక్కెట్ తెచ్చుకున్న కందికుంటను ఓడించొచ్చనే ఎత్తుగడలో అత్తార్ ఉన్నారు. నిజంగా ఇదే జరిగితే కదిరిలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలినట్లే. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు వ్యతిరేకగాలి మధ్య ఎదురీదుతుంటే రెబల్స్ గొడవతో మరింత నష్టపోతున్నారు. -
ఏ మొహం పెట్టుకొని వచ్చారు..?
సాక్షి, కదిరి: ‘చాంద్‌బాషాకు క్యాడర్ లేదు. ఆయనకు టికెట్ ఇవ్వకండి. కందికుంటకివ్వండని చంద్రబాబునాయుడు దగ్గర చెప్పి ఇప్పుడు ఇద్దరూ ఏ మొహం పెట్టుకొని ఎమ్మెల్యే చాంద్‌బాషా ఇంటికి వచ్చారు? ముస్లింలకు టికెట్లు వద్దుగానీ తెలుగుదేశం పార్టీకి ముస్లింల ఓట్లు కావాలా?’ అని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వర్గం ఎంపీ నిమ్మలతోపాటు టీడీపీ అభ్యర్థి కందికుంటపై మండిపడ్డారు. ఎంపీతోపాటు కందికుంట బుధవారం చాంద్ ఇంటికెళ్లి ఆయనను బుజ్జగించాలని చూశారు. అయితే వారికి అక్కడ చాంద్ వర్గం నుంచి చేదు అనుభవం ఎదురైంది. ‘ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో చాంద్‌బాషా నియోజకవర్గంలో తిరిగినప్పుడు ఎంపీగా మీరు చాంద్‌తోపాటు పర్యటించకుండా ఆయన చేతిలో ఓడిపోయిన కందికుంట వెంట తిరిగిన విషయం అప్పుడే మరిచిపోయారా?.. మీరు మర్చిపోయినా మేం ఎలా మరిచిపోతాం. ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు.. మిమ్మల్ని ఈసారి ఇంటికి సాగనంపే వరకూ మేము నిద్రపోము. కదిరి నియోజకవర్గంలో కందికుంట సామాజికవర్గం ఓట్లు 3 వేలకు మించి లేవు. కానీ ముస్లింల ఓట్లు సుమారు 50 వేలున్నాయి. ముస్లింలకు చంద్రబాబు కదిరిలో టికెట్ ఇవ్వనప్పుడు ముస్లింల ఓట్లు టీడీపీకి ఎందుకు వేయాలి?’ అని నిమ్మల కిష్టప్పను చాంద్‌బాషా అనుచరులు ప్రశ్నించడంతో నిమ్మల అవాక్కయ్యారు. చాంద్ అనుచరుఅ ఆగ్రహం చూసి కందికుంట అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. నిమ్మల కిష్టప్ప మాత్రం ఈసారి కందికుంటతోపాటు తనకూ మద్దతు ఇవ్వాలని కోరుతూ అక్కడే కూర్చుండిపోయారు. కదిరి నియోజకర్గంలో మీరు చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పండని చాంద్ అనుచరులు ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించారు. చాంద్‌బాషా తన అనుచరులను సముదాయించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘కబ్జాలు చేసేవారికి, రౌడీయిజం చేసేవారికి, ముస్లింలు, క్రిష్టియన్ల ఆస్తులకు తప్పుడు పత్రాలు పుట్టించి అమ్ముకుంటున్న వారికి టికెట్లు ఇస్తే ప్రజలు ఓట్లేయరు. మేం కూడా వేయము. మీరు ఇక్కడి నుండి మర్యాదగా వెళ్లిపోతే బాగుంటుంది. చాంద్‌బాషాకు టికెట్ రాకపోవడానికి మీరే ప్రధాన కారకులు’ అనడంతో నిమ్మల వెనుదిరగక తప్పలేదు. కార్యకర్తల అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని చాంద్‌బాషా నిమ్మలతో చివరిమాటగా చెప్పారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేతో పవన్ భేటీ
సాక్షి, అనంతపురం: అనంతపురం పర్యటనలో ఉన్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాను కలిశారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అత్తార్ చాంద్ బాషా అధికార టీడీపీ గూటికి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అత్తార్ చాంద్ బాషా ఇంటికి వెళ్లిన పవన్.. ఆయనతో భేటీ అయి ముచ్చటించారు. అలాగే, అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వీ ప్రభాకర్ చౌదరి కూడా పవన్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగా వీరి భేటీ జరిగినట్టు చెప్తున్నారు. పవన్ కల్యాణ్ ఉదయం పరిటాల కుటుంబాన్ని కలుసుకున్న సంగతి తెలిసిందే. చలోరే చలోరే చల్ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న ఆయన మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించి, అనంత సమస్యలపై చర్చలు చేశారు. గుండు వివాదంపై స్పష్టత ఇచ్చిన తర్వాత పవన్ పరిటాల కుటుంబాన్ని కలువడం ఇదే తొలిసారి. -
'అత్తార్'కు అడుగడుగునా అవమానాలు!
డబ్బుకు అమ్ముడు పోయిన మీరా మమ్మల్ని చైతన్య పరిచేది? మా గ్రామానికి మీరు రానవసరం లేదన్న గొడ్డువెలగల ప్రజలు ప్రొటోకాల్‌పై ఎమ్మెల్యేని నిలదీసిన టీడీపీ సర్పంచ్ కదిరి : పార్టీ ఫిరాయించిన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు నియోజకవర్గంలో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం కదిరి మండలం బూరుగు పల్లి గ్రామస్తులు ‘ఒక పార్టీ సింబల్‌తో గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన మీరా మమ్మల్ని చైతన్యం చేసేది? మీలాంటి వారికి మా గ్రామంలోకి అనుమతి లేదు’ అంటూ ఫ్లెక్సీ ద్వారా తమ నిరసనను తెలిపారు. తాజాగా సోమవారం గాండ్లపెంట మండలం గొడ్డువెలగల పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామం వద్ద ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘ఓట్లేసి గెలిపించిన ప్రజలను మీరు మోసగించారు. డబ్బుకు కక్కుర్తి పడి మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. జన చైతన్య యాత్రల పేరుతో మీరు జనాన్ని చైతన్యం చేయడమేంటి? ప్రజలను మోసగించిన మీ లాంటి వారిని మా గ్రామంలోకి అనుమతించం’ అంటూ గొడ్డువెలగల గ్రామ ప్రజల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను నిలదీసిన టీడీపీ సర్పంచ్ ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాను టీడీపీకి చెందిన గొడ్డువెలగల సర్పంచ్ ప్రసాద్ నిలదీశారు. ’కదిరి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వాన పత్రికలో మీ ఫొటో వేయలేదని నానా యాగీ చేసి ఆఖరుకు కార్యక్రమాన్నే రద్దు చేయించారు. మరి ఈరోజు మీరు జనచైతన్య యాత్రల పేరుతో మా గ్రామానికి వచ్చారు. సమావేశం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో గ్రామ సర్పంచ్ ఫొటో వేయాలని మీకు తెలీదా?’ అని ప్రశ్నించారు. అంతకు మునుపు ఆయన పోలీసులతో కూడా ఇదే విషయంపై మాట్లాడారు. పోలీసుల రక్షణతో గ్రామాల్లోకి .. పార్టీ మారిన తన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ముందే ఊహించిన ఎమ్మెల్యే భారీ పోలీస్ బంద్బస్త్తో జనచైతన్య యాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలను పోలీసులు ముందే వెళ్లి వాటిని తొలగించి, అక్కడ పరిస్థితిని చక్కబెట్టిన మీదటే ఎమ్మెల్యే గ్రామాల్లోకి అడుగుపెడుతున్నారు. ఎన్పీ కుంట మండలం గొల్లపల్లి మహిళలు తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేసిన విషయం విదితమే.