రెబల్‌.. గుబుల్‌ | Rebel Candidate Effect For TDP In Anantapuram | Sakshi
Sakshi News home page

రెబల్‌.. గుబుల్‌

Published Fri, Mar 22 2019 8:51 AM | Last Updated on Fri, Mar 22 2019 8:51 AM

Rebel Candidate Effect For TDP In Anantapuram - Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ అభ్యర్థులకు రెబల్స్‌ గుబులు పట్టుకుంది. టీడీపీ తరఫున టిక్కెట్‌ ఆశించి భంగపడిన ఆశావహులు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నారు. టీడీపీ ఓటమే తమ లక్ష్యమని ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలతో బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులంతా ఆందోళనతో చెందుతున్నారు. కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే ‘ఉన్నం’ ఇప్పటికే ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయగా.. గురువారం ‘దుర్గం’లో కాలవకు పోటీగా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. పైగా కాలవను ఓడించడమే ధ్యేయమని ఇప్పటికే ఆయన ప్రకటించారు. దీంతో మంత్రి కాలవ వెన్నులో వణుకుపుడుతోంది. రాయదుర్గం నుంచి బరిలో ఉన్న మంత్రి కాలవ శ్రీనివాసులుకు దెబ్బమీద దెబ్బ పడుతోంది.

గత ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి కాలవను గెలిపించిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఇటీవలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం ‘దుర్గం’లో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ప్రచార సభ జనాలతో కిక్కిరిసింది. వేలాది మందితో దుర్గం హోరెత్తింది. ఈ జనస్పందన చూస్తే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి, మెట్టు కలయికతో పార్టీ మరింత బలోపేతమైందని స్పష్టమవుతోంది. ఈ సభ విజయవంతంతోనే  కాలవ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతలోనే దీపక్‌రెడ్డి గురువారం ఓ సెట్టు నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే కాలవ బరిలో ఉన్నారు.

అయినప్పటికీ దీపక్‌రెడ్డి నామినేషన్‌ వేయడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రెండేళ్లుగా కాలవను దీపక్‌రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాలవకు టిక్కెట్‌ రాకుండా తాను బరిలో ఉండాలని యత్నించారు. టీడీపీ అధిష్టానం కాలవకు టిక్కెట్‌ ఇస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తానని చెప్పారు. అయితే అధిష్టానం సర్దుబాటు చేస్తుందని అంతా భావించారు. అయినప్పటికీ దీపక్‌ మాత్రం నామినేషన్‌ వేశారు. ముహూర్తం బాగుందని నామినేషన్‌ దాఖలు చేశామని, ఈ నెల 25న భారీర్యాలీ నిర్వహించి నామినేషన్‌ వేస్తామని ఆయన తెలిపారు. ‘దుర్గం’ టీడీపీలో ‘మెట్టు’, దీపక్‌రెడ్డికి బలమైన కేడర్‌ ఉంది. మెట్టు వెళ్లడంతో ఓ వర్గం టీడీపీకి దూరమైంది. మరో వర్గం దీపక్‌రెడ్డి వెంట నడవనుంది. దీంతో కాలవ పూర్తిగా బలహీనపడినట్లయింది. సర్వేల్లోనూ కాలవకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో దీపక్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం చూస్తే అక్కడ ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో స్పష్టమవుతోంది. 

కళ్యాణదుర్గంలో ‘ఉన్నం’ ప్రచారం షురూ 
కళ్యాణదుర్గంలో నియోజకవర్గంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ తరఫున ఉషాశ్రీ చరణ్, కాంగ్రెస్‌ తరఫున పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, టీడీపీ తరఫున ఉమామహేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇప్పటికే నామినేషన్‌ వేసిన ‘ఉన్నం’ ఇండిపెండెంట్‌గా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ టీడీపీ కూడా రఘువీరాకు సహకరించేందుకు సిద్ధమైంది. అయితే కొన్నేళ్లుగా కాంగ్రెస్‌పై పోరాడి కష్టనష్టాలకోర్చిన టీడీపీ శ్రేణులు ‘చంద్రబాబు–రఘువీరా’ కుమ్మక్కు రాజకీయాలపై తీవ్రంగా రగిలిపోతున్నారు. వారి రాజకీయానికి తాము బలికావాలా? అంటూ రఘువీరాతో పాటు ఉమామహేశ్వర్‌కు కూడా సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. రఘువీరా, ఉమా, ఉన్నంలు టీడీపీ ఓట్లును చీల్చనున్నారు. ఇదే జరిగితే అక్కడ ఎలాంటి ఫలితం ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉషాశ్రీ చరణ్‌ వైఎస్సార్‌సీపీ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రచారంలో దూసుకుపోతున్నారు. 

గుప్తా కూడా రెబల్‌గానే బరిలోకి 
టీడీపీ తరఫున గుంతకల్లు టిక్కెట్‌ ఆశించి భంగపడిన మధుసూదన్‌ గుప్తా జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. జనసేన తరఫున పోటీలో ఉన్నా...ఇతన్ని కూడా టీడీపీ రెబల్‌గానే భావించాలి. ఏడాదిగా అతను టీడీపీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో పనిచేశారు. జితేంద్రగౌడ్‌కు కాకుండా గుప్తాకే టిక్కెట్‌ అని ఆపార్టీ శ్రేణులు భావించాయి. ఎంపీ జేసీ కూడా గుప్తానే అభ్యర్థి అని ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో గౌడ్‌ బలహీనంగా తయారయ్యారు. ఇప్పుడు గుప్తాకు కాకుండా తిరిగి గౌడ్‌కే టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో గుప్తా పార్టీ వీడి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. టీడీపీలోని బలమైన వర్గం గుప్తాతో నడవనుంది. దీంతో టీడీపీ ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వెంకట్రామిరెడ్డికి టీడీపీలోని ఓట్ల చీలిక  కలిసిరానుంది. 

ఇండిపెండెంట్‌గా బరిలోకి అత్తార్‌..! 
కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా ఇండిపెండెంట్‌గా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ నిమ్మల కిష్టప్ప, కందికుంట ప్రసాద్‌ చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదని అత్తార్‌తో అనుచరులు చెబుతున్నారు. కందికుంటకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి కందికుంటను ఓడించాలనే భావనలో అత్తార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీ నేతగా ఉన్న అత్తార్‌ వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి టీడీపీ కండువా కప్పుకుని మైనార్టీ ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారు. దీంతో అత్తార్‌ వెంట మైనార్టీలు వచ్చే అవకాశం లేదు. ఈ విషయం అత్తార్‌కు తెలుసు. అయితే టీడీపీలో ఉన్న మైనార్టీయేతర వర్గాల ఓట్లనైనా తాను చీల్చగలనని, తద్వారా సిట్టింగ్‌ అయిన తనను కాదని టిక్కెట్‌ తెచ్చుకున్న కందికుంటను ఓడించొచ్చనే ఎత్తుగడలో అత్తార్‌ ఉన్నారు. నిజంగా ఇదే జరిగితే కదిరిలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలినట్లే. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు వ్యతిరేకగాలి మధ్య ఎదురీదుతుంటే రెబల్స్‌ గొడవతో మరింత నష్టపోతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement