Audit objections
-
అభ్యంతరాలపై చర్యలేవీ?
సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని పలు శాఖల్లో ఆడిట్ అభ్యంతరాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. అధికారులు ఇష్తానుసారం ఖర్చు చేయడం... వాటిపై జమాఖర్చుల శాఖ అభ్యంతరం చెప్పడం పరిపాటిగా మారిం ది. వీటికి సరైన లెక్కలు చూపించడం లేదు సరికదా... వెచ్చించిన నిధులు వెనక్కు చెల్లించకపోవడంతో ప్రభుత్వ నిధులు వృధా అవుతున్నాయి. జిల్లాలో కొన్నేళ్లలో చేసిన ఆడిట్ ద్వారా కోట్లాది రూపాయల ఖర్చుపై భారీ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక సంస్థలకు సంబం ధించి ఆడిట్‌ను జిల్లా ఆడిట్‌శాఖ అధికారులు ఏటా చేపడుతుంటారు. ఈ సందర్భం గా అధికారులు కొన్ని రకాల ఖర్చులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటికి సరైన లెక్కలు చూపించాల్సిన బాధ్యత సంబంధి త అధికారులపై ఉంటుంది. అలా కానప్పు డు ఖర్చు చేసిన మొత్తాన్ని సంబంధిత అధికారి తిరిగి చెల్లించాలి. లేకుంటే వారి వేతనం, ఇతర ఖాతాల నుంచి రికవరీ చే యాలి. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు చూ స్తే జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం రూ.307.80కోట్లకు సంబంధించి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రికవరీపై కానరాని శ్రద్ధ.. అడిట్ అధికారులు సాధారణంగా 19రకాల ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. ఇందులో అకౌంట్ అంకెల్లో తేడా, అధిక నిధుల వినియోగం, నిధుల పక్కదారి, నిధులు ఖర్చు చేయకపోవడం, అనవసర ఖ ర్చు, అడ్వాన్సుల పెండింగ్ సర్దుబాటు, నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం, అధిక చెల్లింపులు, నిరుపయోగ ఖర్చు ఇలా అనేక రకాల అంశాలపై ఆడిట్లో చూస్తారు. సక్రమంగా లేని అంశాలపై అభ్యంతరాన్ని సంబంధిత అధికారికి పంపిస్తారు. వాటిపై ఆ అధికారి వివరణ ఇచ్చుకుని, సరైన లెక్కలు చూపాలి. లేకుంటే బాధ్యత వహించి వాపసు చేయాలి. కానీ ఈ విషయంలో అధికారులు ఎక్కువమంది సరైన లెక్కలు చూపడం లేదు. అప్పట్లో ఉన్న అధికారులు బదిలీ కావడమో... రిటైర్ కావడమో... అయితే ఇక రికవరీకి అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు వీటిపై లెక్కలు తేలిస్తే ప్రభుత్వ నిధులు వృధా అయ్యే అవకాశం ఉండదు. ఈ విధంగా వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో సుమారు రూ.20కోట్ల వరకు ఉంటుంది. వీటిని రికవరీ చేయక పోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం కలుగుతోంది. జిల్లా కలెక్టర్ వంటివారు సైతం వీటిని పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. మూడు నెలలకోసారి సమీక్ష.. ఆడిట్ చేసి ఖర్చులో లోపాలుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయడం మా విధి. ఇలా ప్రతి ఏడాది చేస్తున్నాం. వాటిని పరిష్కరించుకో వాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. అందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తాం. ఆ రోజు సరైన లెక్కలు చూపించిన వాటిని తీసేస్తాం. ఇంకా పరిష్కరించుకోనప్పుడు సర్‌ఛార్జి నోటీసులు ఇచ్చి రికవరీకి ఆదేశిస్తాం. ఆ సమాచారం మా శాఖ ఉన్నతాధికారులకు పంపిస్తాం. అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళుతుంది. ఉన్నతస్థాయి నుంచి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలొస్తాయి. – ఆర్.మల్లికాంబ, జిల్లా ఆడిట్ అధికారి -
‘లెక్కే’లేదు..
జిల్లాలో రూ.1209 కోట్ల ఆడిట్ అభ్యంతరాలు విశాఖలో అత్యధికం జీవీఎంసీలోనే రూ.780 కోట్లు దుర్వినియోగమైన నిధులు కూడా కోట్లలోనే.. ఆర్ఆర్ యాక్టు ప్రయోగించేందుకు జంకుతున్న అధికారులు సాక్షి, విశాఖపట్నం: రాష్ర్టంలో రూ.10 వేల కోట్ల విలువైన ఆడిట్ అభ్యంతరాలుంటే వాటిలో 12 శాతం విశాఖ జిల్లావే. ఒక్క విశాఖ జిల్లాలోనే ఇప్పటివరకు ఏకంగా రూ.1208 కోట్ల 56 లక్షల 57 వేల విలువైన 2 లక్షల11 వేల 165 ఆడిట్ అభ్యంతరాలున్నాయి. ఇంత పెద్దసంఖ్యలో అభ్యంతరాలున్న జిల్లా రాష్ర్టంలో మరొకటి లేదనే చెప్పాలి. జీవీఎంసీతోపాటు జిల్లాలో 11 ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఏటా రాష్ర్ట ఆడిట్ విభాగం క్రమం తప్పకుండా ఆడిటింగ్ చేస్తుంటుంది. వీటి పరిధిలో 1967-2014ల మధ్య జరిగిన ఆడిటింగ్‌కు సంబంధించి గుర్తించిన ఆడిట్ అభ్యంతరాలే ఎక్కువగా ఉన్నాయి. అభ్యంతరాల పరంగా చూస్తే జిల్లా పరిధిలో పంచాయతీల్లోనే అత్యధికంగా ఉన్నాయి. వీటిలో ఏకంగా లక్షా 87వేల 859 ఆడిట్ అభ్యంతరాలున్నాయి. వీటి విలువ అక్షరాలా రూ.124 కోట్ల 54 లక్షలు. ఇక విలువపరంగా చూస్తే జిల్లాలో అత్యధికంగా జీవీఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ పేరుకుపోయిన 1348 ఆడిట్ అభ్యంతరాల విలువ ఏకంగా రూ.779కోట్ల 68లక్షల పైమాటే. జీవీఎంసీలో 14 ఏళ్ల ఆడిటింగ్ జరగలేదు జీవీఎంసీ పరిధిలో ఏకంగా 14 ఏళ్లకు సంబంధించిన ఆడిటింగ్ జరగనేలేదు. రాష్ర్ట ఆడిట్ విభాగం ఎన్నిసార్లు లేఖలు రాసినా ఆయా సంవత్సరాలకు సంబంధించిన రికార్డులను సమర్పించడంలో మాత్రం జీవీఎంసీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జీవీఎంసీ పరిధిలోనే అవకతవకలు..అవినీతి ఎక్కువగా జరిగినట్టుగా ఆడిటింగ్‌లో గుర్తించారు. ఏళ్లతరబడి ఇచ్చిన అడ్వాన్సులు రికవరీ చేసుకోకపోవడం..మంజూరుకు మించి నిబంధనలకు విరుద్దంగా ఖర్చు చేయడం వంటి అవకతవకలు ఎక్కువగా జీవీఎంసీ పరిధిలో జరిగాయి. ఇక ఏయూతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలు లెక్కలేనంతగా ఉన్నాయి. ఒక్క ఏయూ పరిధిలోనే సుమారు రూ.100కోట్లకు పైగా ఆడిట్ అభ్యంతరాలున్నట్టుగా చెబుతున్నారు. ఆడిటింగ్‌లో రాజకీయ ఒత్తిళ్లదే ప్రధాన భూమిక ప్రతి శాఖలోనూ బడ్జెట్ కనుగుణంగా కేటాయింపులు జరిగాయా? లేదా?, జరిగిన కేటాయింపులకు తగ్గట్టుగా ఖర్చులు చేశారా? లేదా?, ఆ ఖర్చులు కూడా నిబంధనలకనుగుణంగా జరిగాయా ? లేదా ? వంటి విషయాలపై ఏటా రాష్ర్ట ఆడిట్ విభాగం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దుర్వినియోగమైనట్టుగా నిర్ధారణయితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్)యాక్టును ప్రయోగించి వడ్డీతో సహా రికవరీ చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక అవకతవకల్లో అధికారులు లేదా సిబ్బంది భాగస్వామ్యం ఉన్నట్టుగా నిర్ధారణ అయితే వారిపై క్రమశిక్షణా చర్యలే కాదు..అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు చట్టంలో ఉంది. కానీ ఏటా ఈ ఆడిట్ శాఖ తనిఖీలు చేయడం.. అభ్యంతరాలు తెలపడమే తప్ప అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నదాఖలాలులేవనే చెప్పాలి. పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలు 1967 నుంచి ఉండడంతో ఇందుకు బాధ్యులైన వారిలో చాలా మంది ఇప్పటికే పదవీవిరమణ చెందడంతో పాటు చాలా మంది కాలం చేసినవారు కూడా ఉన్నారు. వీరి నుంచి రికవరీ చేయడం సాధ్యమయ్యే పనికాదనే చెప్పాలి. ఈ పరిస్థితికి రాజకీయ ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల ఉదాశీన వైఖరే కారణం. ఇప్పటికైనా ఆడిట్ అభ్యంతరాల విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి నిర్ణీత గడువులోగా వీటిని పరిష్కరించకపోతే భవిష్యత్‌లో వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వారి నుంచి ఆర్ ఆర్ యాక్టు ద్వారా రికవరీ చేయడంతో పాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటేనే ఈ పరిస్థితి గాడిలో పడుతుంది..