నెలంతా పండుగే..
రాయవరం : ఆగస్టు.. ఈ నెలంతా పండుగ వాతావరణమే. నాలుగైదు పండుగలతో పాటు శ్రావణమాసం కలుస్తుండడంతో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించినా మేలు జరుగుతుందనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది.
7న నాగపంచమితో ప్రారంభం..
ఆదివారం నాగుల పంచమి. నాగపంచమి రోజున సంతానం లేని వాళ్లు, వివాహం కావల్సిన వారు నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. నాగేంద్రుడిని దర్శించుకుంటారు. పాముల పుట్టలు, నాగదేవత ఆలయాల్లో పాలు పోస్తారు. ఇలా చేస్తే నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
9న మంగళగౌరీ వ్రతం..
శ్రావణమాసంలో మహిళలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుతూ ముత్తయిదువలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం, నోము నోయడం జిల్లాలో అనాదిగా వస్తోంది.
12న వరలక్ష్మీ వ్రతం..
శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదిగా హిందువులు భావిస్తుంటారు. రెండో శుక్రవారం మహిళలు ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. వ్రతం ఆచరిస్తే అషై్టశ్వర్యాలు సమకూరడంతో పాటు మాంగళ్య బంధం బలపడుతుందని నమ్ముతారు.
15న స్వాతంత్య్ర దినోత్సవం..
ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ రోజు ఆగస్టు 15. సుమారు 200 ఏళ్ల బ్రిటిష్ వారి చీకటి పాలనకు తెరపడిన రోజు. ఈ రోజున జిల్లాలో ఉన్న 52 లక్షల మందికి పండుగే అని చెప్పవచ్చు.
18న రాఖీ పౌర్ణమి..
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలా మంది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఎంత దూరంలో ఉన్నా తల్లిదండ్రుల ఇంటికి చేరుతారు.
24న కృష్ణాష్టమి..
కృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగ నిర్వహిస్తుంటారు. చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి, వారి లేత పాదాలకు రంగులు అద్ది, ఇంట్లో బుడి బుడి అడుగులు వేయిస్తుంటారు. వారి పాదముద్రలను చూసి మురిసిపోతుంటారు. కృష్ణాష్టమినాడే ఉట్టి కొడితే పుణ్యం లభిస్తుందని యువకులు ఉట్టి కొట్టడానికి పోటీ పడుతుంటారు. ఉట్టిలోని నైవేద్యాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం.