జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తణుకు : కొద్దిరోజులుగా భానుడి భుగభుగలకు జిల్లాకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆగస్ట్‌లో భారీ వర్షాలు కురవాల్సి ఉండగా ఎన్నడూ లేనట్టుగా వాతావరణం నడి వేసవిని తలపిస్తోంది. రెండు వారాలుగా భానుడు ఉగ్రరూపం దాల్చుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో వారంతా తల్లడిల్లుతున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక జూలై నెలలో వర్షాలు కురిసినప్పటికీ ఆగస్ట్ రెండో వారం నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. సాధారణంగా ఆగస్ట్‌లో వర్షాలు పడతాయని, వాతావరణం చల్లబడుతుందని ఆశించిన ప్రజలకు సూరీడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు ఉదయం నుంచి వీస్తున్న వడగాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోహిణీ కార్తె ముగిశాక జూన్ రెండో వారంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ తర్వాతి రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. గత నెల నెలాఖరు, ఈ నెల మొదటి రెండు రోజుల్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాడ్పులతో పాటు ఉక్కపోత కూడా తోడయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
35 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతల నమోదు
నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు జిల్లాలో 35 డిగ్రీలపైగా నమోదవుతున్నాయి. ఏలూరులో గురు, శుక్రవారాల్లో 35 డిగ్రీల పైగా నమోదు కాగా ప్రధాన పట్టణాలన్నింటిలో దాదాపు అదే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు నిత్యం రద్దీగా ఉండే రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వేడి ఉంటోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.