నరసింహన్‌ను ప్రశ్నించిన సీబీఐ
సాక్షి, హైదరాబాద్: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో సాక్షిగా సీబీఐ బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను ప్రశ్నించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు 90 నిమిషాల పాటు రాజ్‌భవన్‌లో గడిపింది. హెలికాప్టర్ల సర్వీస్ పరిమితికి సంబంధించి చేసిన మార్పులపై ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ డెరైక్టర్ అరుున నరసింహన్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. హెలీకాప్టర్ల సర్వీస్ పరిమితితో పాటు, హెలికాప్టర్ ఎగరాల్సిన ఎత్తుకు సంబంధించిన పరిమితిపై నిర్ణయం తీసుకునేందుకు.. 2005 మార్చి 1న జరిగిన కీలక సమావేశంలో ఇతర ఉన్నతాధికారులతో పాటు ఐబీ డెరైక్టర్ హోదాలో నరసింహన్ కూడా పాల్గొన్నారు.
హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి గాను అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు అర్హత లభించేలా (పరిమితులు తగ్గిస్తూ) ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారనేది ఆరోపణ. అలా తగ్గించనట్టైతే అగస్టా కనీసం టెండర్లు వేసేందుకు కూడా అర్హత సాధించగలిగేది కాదని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ భేటీలో పాల్గొన్న అప్పటి జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) ఎం.కె.నారాయణన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) మాజీ అధినేత బి.వి.వాంఛూలను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది. కేసులో అదనపు సమాచారం రాబట్టేందుకు నరసింహన్ వాంగ్మూలాన్ని సైతం కీలకంగా భావిస్తున్న దర్యాప్తు సంస్థ అధికారులు.. ఆయన్ను ప్రశ్నించేందుకు అవసరమైన అనుమతులు తీసుకున్నారు.
జారుుంట్ డెరైక్టర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీబీఐ బృందం బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంది. దాదాపు 90 నిమిషాల పాటు (11.15 నుంచి 12.45 వరకు) వారు రాజ్‌భవన్‌లో ఉన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 161 ప్రకారం సీబీఐ బృందం గవర్నర్ నరసింహన్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. పరిమితులు మార్చడానికి గల కారణాలు, ఆ సమావేశంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారు? తదితర విషయాలపై ఆరా తీసినట్టు తెలిసింది. అత్యంత ప్రముఖుల ప్రయాణాల కోసం అవసరమైన 12 అత్యాధునిక హెలీకాప్టర్లను కొనుగోలు చేయాలని 2005లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదిరింది. అగస్టాతో ఒప్పందం కుదిరేలా నిబంధనల్లో మార్పుచేర్పులు చేసేందుకు గాను భారతీయ అధికారులకు రూ.360 కోట్ల మేర ముడుపులు ముట్టినట్టు ఇటలీ దర్యాప్తు అధికారులు ఆరోపించిన నేపథ్యంలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగితో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో త్యాగి సమీప బంధువులతో పాటు ఈరోపియన్ దళారులు కొందరు ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను త్యాగి ఖండించారు. సీబీఐ ప్రశ్నించిన తర్వాత గవర్నర్లుగా ఉన్న నారాయణన్, వాంచూలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.