ఉన్మాదంపై ఎటాక్
అరోరా కాలేజీలో సోమవారం చోటుచేసుకున్న ప్రేమోన్మాది దురాగతం పై విద్యార్థి లోకం ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి దారుణాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అమ్మాయిల రక్షణ కోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరింది. ప్రేమోన్మాదులపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చింది. బండ్లగూడలోని అరోరా సైంటిఫిక్, టెక్నలాజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీలో విద్యార్థిని రవళిపై ప్రేమ పేరుతో గుంటూరుకు చెందిన యువకుడు కత్తితో దాడికి పాల్పడి, ఆ తరువాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కళాశాలలో తీవ్ర కలకలం రేపింది. దాడి జరుగుతున్న సమయంలో కొందరు విద్యార్థులు అడ్డుకొని రవళిని కాపాడిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న సంకల్పంతో ‘సాక్షి’ మంగళవారం కళాశాలలో చర్చావేదికను నిర్వహించింది. కళాశాల డెరైక్టర్ చేపూరి శ్రీలత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మరోసారి ఇలాంటి దారుణాలు జరగకుండా తల్లిదండ్రులు, ప్రభుత్వాలు కలసి కట్టుగా కృషి చేయాలని విద్యార్థులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. దాడి సమయంలో ప్రత్యక్షంగా అక్కడ ఉన్న కొందరు విద్యార్థులతో పాటు, అధ్యాపకుల అభిప్రాయాలు.
- కర్నాటి శ్రీనివాస్
పోలీసుల వైఫల్యమే..
రవళిని ప్రదీప్ రెండు మూడేళ్ల నుంచి వేధిస్తున్నప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రదీప్‌పై రెండు కేసులు సైతం నమోదయ్యాయి. నిర్భయ చట్టం కింద కేసు నమోదైనా అతడు ఎలా బయట తిరిగాడు. పోలీసులు సరిగ్గా వ్యవహరిస్తే ఈ ఘటన జరిగేది కాదు. ఈ సంఘటనలో విషం తాగిన ప్రదీప్‌ను కూడా తాము మానవతా దృక్పథంతో ఆస్పత్రిలో చేర్పించాం. పిల్లల నడతకు బాధ్యత తల్లిదండ్రులదే. తాము ఎంత చెప్పినా ఫలితం లేకుండా పోయిందనే సమాధానమే ప్రదీప్ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. పిల్లలు చిన్నప్పటి నుంచే తప్పటడుగులు వేయకుండా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి.
- చేపూరి శ్రీలత, డెరైక్టర్, అరోరా కళాశాల.
షాక్‌కు గురయ్యాం.
ఉదయాన్నే కాలేజీలో అడుగు పెట్టిన కొద్ది సేపటికే రవళిపై దాడి జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసి షాక్‌కు గురయ్యా. ఈ సంఘటనతో తల్లిదండ్రుల్లో సైతం భయాందోళనలు
అలుముకున్నాయి.
- ప్రజ్ఞ, ఈసీఈ నాలుగో సంవత్సరం
అడ్డుకున్నాం..
అప్పటికే రవళి తలపై ప్రదీప్ కత్తితో రెండు సార్లు దాడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రవళిపై మరోసారి దాడి చేయడానికి యత్నిస్తుండగా మా ల్యాబ్ ఇన్చార్జి ప్రవీణ్ అడ్డుకున్నారు. అతన్ని బలంగా హెల్మెట్‌తో కొట్టాడు. ఇద్దరూ పెనుగులాడుకున్నారు. ప్రదీప్‌ను పట్టుకుందామనుకునే లోపే విషం తాగాడు. గతంలో కూడా రవళిపై రెండుసార్లు దాడికి పాల్పడిన ప్రదీప్‌ను పోలీసులు కఠినంగా శిక్షించకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది.
- శ్రవణ్ కుమార్, ఈఈఈ 4వ సంవత్సరం.
పక్కనే ఉన్నాను..
రవళిపై దాడి చేసిన సమయంలో ఆమె పక్కనే ఉన్నాను. భయంతో వణికిపోయాను. నా వెనుక నుంచి వచ్చిన ప్రదీప్ బ్యాగ్‌లో నుంచి కత్తి తీసి ఒక్కసారిగా దాడికి దిగాడు. అధ్యాపకులు, ఇతర విద్యార్థులు ప్రదీప్‌ను అడ్డుకోవడంలో ఏ మాత్రం ఆలస్యమైనా రవళిని చంపేసేవాడు.
- లక్ష్మీ, సీఎస్ఈ 3వ సంవత్సరం.
ప్రేమ పేరుతో అఘాయిత్యాలా..!
అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేయడం సరికాదు. ఇలాంటి వారికి తల్లిదండ్రులతో పాటు పోలీసులు కూడా కౌన్సెలింగ్ చేయాలి. ప్రదీప్ విషయంలో పోలీసులు సరిగ్గా వ్యవహరించి ఉంటే రవళిపై దాడి జరిగేది కాదు.
- మౌనిక, సీఎస్ఈ 4వ సంవత్సరం.
స్వేచ్ఛ పేరుతో..
15 ఏళ్లు దాటగానే యువత స్వేచ్ఛ పేరుతో తల్లిదండ్రుల నియంత్రణలో నుంచి బయటికి వస్తున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలి. ఇలాంటి చనువు ఉంటేనే తమ విషయాలన్నింటిని పేరెంట్స్‌తో షేర్ చేసుకోగలుగుతారు. మా పిల్లాడు ఎదిగాడని వదిలేస్తే ఇలాంటివే జరుగుతాయి.
- సృజన్ రెడ్డి, అధ్యాపకుడు, ఈసీఈ విభాగం.
శిక్షలు కఠినంగా ఉండాలి..
ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. అరెస్టయిన వారు కూడా బెయిల్‌పై ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. శిక్షలు కఠినంగా ఉండాలి.. వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. మానవ సంబంధాలు, విలువలపై పాఠశాల స్థాయి నుంచే బోధన జరిగేలా చూడాలి.
- మనీష్, ఈసీఈ 4వ సంవత్సరం.
ఎలా దాడి చేయాలో చూపిస్తున్నారు..
అమ్మాయిలను బయటకు పంపాలంటేనే తలిదండ్రులు భయపడుతున్నారు. ప్రతి అమ్మాయిలో అమ్మను చూసుకోవాలి. అమ్మకిచ్చిన మర్యాదను ఇతరులకు ఇవ్వాలి. టీవీల ప్రభావం కూడా నేటి తరంపై అధికంగా ఉంటుంది. ఎలా దాడులు చేయాలో షూట్ చేసి మరీ చూపిస్తున్నారు.
- రక్షిత, ఈఈఈ 4వ సంవత్సరం.
కరాటే నేర్చుకోవాలి..
ప్రస్తుత సమాజంలో మహిళలు కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలి. అప్పుడే మగాళ్ల దాడుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకునే దిశగా సమాజం అంతా కదలిరావాలి.
- భార్గవి, ఈఈఈ 3వ సంవత్సరం.